Center for Social Development report: పురుషులు, మహిళల్లో ఊబకాయం బహుళ అనారోగ్యాలు కలిగించే ప్రధాన సమస్యగా నేడు మారుతోంది. ఈ ఇబ్బంది ఇటీవల దక్షిణాదిలో ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా ఉన్నట్లు సామాజిక అభివృద్ధి కేంద్రం (సీఎస్‌డీ) అధ్యయనంలో వెల్లడైంది. జాతీయస్థాయిలో పురుషుల కన్నా మహిళల్లో సమస్య అధికంగా ఉంటే.. కర్ణాటక, తెలంగాణలో మాత్రం మహిళల కన్నా పురుషుల్లోనే ఎక్కువగా ఉందని పేర్కొంది. మహిళల్లో ఊబకాయం/అత్యధిక బరువు సమస్య దక్షిణాదిలోనే ఎక్కువగా కన్యాకుమారి జిల్లాలో 53శాతం ఉంటే.. ఆ తరువాత స్థానంలో హైదరాబాద్ (51శాతం) ఉంది.
గిరిజన ప్రజలు, ఆదివాసీలు నివసించే కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా 14శాతంతో దక్షిణాదిలోనే మెరుగైన స్థానంలో ఉంది. తమిళనాడు, కర్ణాటక, ఏపీ, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లోని 120 జిల్లాల్లో 15-49 ఏళ్ల వయసున్న మహిళల్లో ఊబకాయ సమస్యపై అధ్యయనం చేసిన సీఎస్‌డీ ‘దక్షిణాది రాష్ట్రాల్లోని మహిళల్లో ఊబకాయం’ నివేదికను రూపొందించింది. ఆ సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ ప్రొఫెసర్ సుజిత్ కుమార్ మిశ్రా సమక్షంలో ఈ నివేదికను తెలంగాణ మహిళాశిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యదేవరాజన్ విడుదల చేశారు.
జాతీయ స్థాయిలో ఊబకాయ పెరుగుదల రేటు 3.3 శాతం నమోదైతే, తెలంగాణ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. తమిళనాడులో 9.5 శాతం, కర్ణాటకలో 6.9, కేరళలో 5.7 శాతం ఉంటే... తెలంగాణలో మాత్రం అత్యల్పంగా 2 శాతమే నమోదైంది.
అత్యల్ప ఊబకాయం ఉన్న 20 జిల్లాల్లో 11 రాష్ట్రంలోనివే
* దక్షిణాది రాష్ట్రాల్లోని అత్యల్ప ఊబకాయం ఉన్న 20 జిల్లాల్లో రాష్ట్రానివి 11 ఉన్నాయి. మిగతా తొమ్మిది కర్ణాటకకు చెందినవి.
* ఏపీలో అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో ఊబకాయ రేటు 23.8శాతం ఉంటే, గుంటూరులో అత్యధికంగా 46.4 శాతం ఉంది. కర్ణాటకలో అత్యల్పంగా యాద్‌గిరిజిల్లాలో 18.8 శాతం మందిలో సమస్య ఉంటే.. బెంగళూరులో 40.1శాతం మందిలో ఈ ఇబ్బంది ఉంది.
* దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక సంపద ఉన్న 42 శాతం మందికి పైగా మహిళలు ఈ రుగ్మతతో బాధపడుతున్నారు.
* సామాజిక, ఆర్థిక, వర్గాల వారీగా పరిశీలించినపుడు గిరిజనుల్లో ఊబకాయ రేటు అత్యల్పంగా ఉంది. జాతీయ స్థాయిలో క్రైస్తవ మహిళల్లో 31.2 శాతం ఉంటే.. ముస్లింల్లో 26.0 శాతం, హిందువుల్లో 23.3 శాతంగా ఉంది. దక్షిణాది రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే కర్ణాటక మినహా తమిళనాడు, ఏపీ, కేరళ, తెలంగాణల్లోని ముస్లింల్లో ఊబకాయ సమస్య ఎక్కువగా ఉంది. కర్ణాటక క్రైస్తవుల్లో ఈ రేటు ఎక్కువ ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.
ఇవీ చదవండి: