ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. 24 గంటల్లో (శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు) 72,861 నమూనాలను పరీక్షించగా 6,224 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.
దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,13,014కి చేరింది. కరోనాతో ఇవాళ మరో 41 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి 5,941 మంది మృతి చెందారు. వివిధ కొవిడ్ ఆసుపత్రులు, హోం ఐసోలేషన్‌లో 55, 282 మంది చికిత్స పొందుతుండగా.. 6,51,791 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది.
కరోనాతో ఇవాళ కృష్ణా జిల్లాలో ఆరుగురు, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, ప్రకాశంలో నలుగురు, విశాఖ పట్నంలో నలుగురు, నెల్లూరు ముగ్గురు, అనంతపురం, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరేసి, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
గడిచిన 24 గంటల్లో 7,798 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 60,21,395 నమూనాలను పరీక్షించినట్లు వైద్య శాఖ వెల్లడించింది.
విజయనగరం ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కరోనా సోకడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంఘటన విజయనగరంలో చోటు చేసుకుంది. గంట్యాడ, దత్తి జిల్లా ఉన్నత పాఠశాలల్లోని 9,10 తరగతుల విద్యార్థులకు కరోనా సోకింది. గత నెల 30న గంట్యాడ ఉన్నత పాఠశాలలో 73 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 20 మందికి నిర్ధరణ అయింది.
దత్తిలోని పాఠశాలలో 100 మందిలో ఎనిమిది మందికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో తరగతుల నిర్వహణపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. సమాచారాన్ని జిల్లా విద్యాశాఖ అధికారిణి నాగమణి ఉన్నతాధికారులకు ఇచ్చారు.