కరోనా రెండో దశలో రాష్ట్రంలోని 600 మందికిపైగా ఎస్బీఐ ఉద్యోగులు కరోనా బారినపడినట్లు హైదరాబాద్ సర్కిల్ సీజీఎం ఓం ప్రకాశ్ మిశ్ర తెలిపారు. కొవిడ్ కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. రేపటి నుంచి సగం మంది ఉద్యోగులే బ్యాంకుల్లో పనిచేయనున్నారని సీజీఎం ఓం ప్రకాష్ మిశ్ర వెల్లడించారు. మొత్తం 12,500 మంది ఉద్యోగుల్లో మొదటి దశలో 2,200 మంది, రెండో దశలో ఇప్పటి వరకు 600 మంది కరోనా బారిన పడ్డారని పేర్కొన్నారు. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు ఉన్న ఉద్యోగులకే ఎక్కువగా కొవిడ్ సోకిందని తెలిపారు.
రేపటి నుంచి..
ఇప్పటి వరకు వంద బ్యాంకు శాఖల ఉద్యోగులు ఎక్కువ మంది కరోనా బారిన పడడం వల్ల.. ఆయా బ్రాంచీలను రెండు, మూడు రోజులుపాటు మూసివేసి తిరిగి తెరిచామన్నారు. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు.. రేపటి నుంచి ఏప్రిల్ 30 వరకు సగం మంది సిబ్బందితోనే బ్యాంకులు పనిచేస్తాయని తెలిపారు.
అత్యవసరమైతేనే రండి..
సాధారణ ఉష్ట్రోగ్రతలు కలిగి.. మాస్కులు ధరించిన ఖాతాదారులనే బ్యాంకుల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. వీలైనంత వరకు ఖాతాదారులు.. డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకోవాలని సూచించారు. అత్యవసరమైతేనే బ్యాంకులకు వెళ్లాలన్నారు. బ్యాంకు శాఖలు తెరిచి ఉన్నాయా లేదా అన్న వివరాల కోసం తెలుసుకునేందుకు 040-23466233 హెల్ప్ లైన్ నంబర్‌ను హైదరాబాద్ ఎస్బీఐ సర్కిల్ అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కోఠి, సికింద్రాబాద్ ఎస్బీఐ కార్యాలయాల్లో ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇవీచూడండి: వారంలోగా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో రెమ్‌డెసివిర్: కేటీఆర్