తెలంగాణ మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను ఏపీ ఎస్ఈబీ అధికారులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి గుంటూరుకు తరలిస్తుండగా గుంటూరు వద్ద ఏఈఎస్ చంద్రశేఖర్ రెడ్డి అధ్వర్యంలో పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 1920 మద్యం సీసాలను, 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 6 లక్షలు ఉంటుందని ఎస్ఈబీ అదనపు ఎస్పీ ఆరిఫ్ హాజిఫ్ తెలిపారు. నిందితులు రామాంజనేయులు, మచ్చా సురేశ్, కె. నరేశ్, గంటా హరీశ్లుగా పోలీసులు గుర్తించారు.
వీరిలో ఏపీ భాజపా నేత గుడివాక రామాంజనేయులు అలియాస్ అంజిబాబు ఎ-1 నిందితుడని అధికారి చెప్పారు. ఈయన 2019లో మచిలీపట్నం భాజపా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు.
పార్టీ నుంచి సస్పెండ్
తెలంగాణ నుంచి మద్యం తరలింపు కేసులో పట్టుబడిన నిందితుడు రామాంజనేయులు అలియాస్ అంజిబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.