రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఆరుగురిని బలితీసుకుంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించకముందే వారంతా మృతిచెందారు. ఈనెల 13 నుంచి 15 వరకు దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న మర్కజ్ మసీదులో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్రానికి చెందిన పలువురు ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్టు సమాచారం. అక్కడ పాల్గొని వచ్చిన వారిలో ఆరుగురు అనారోగ్య కారణాలతో చనిపోయారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా వైరస్ నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇద్దరు గాంధీలో చికిత్స పొందుతూ మృతిచెందగా.. గ్లోబల్, అపోలో ఆస్పత్రి, గద్వాల, నిజామాబాద్‌లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు వైద్య ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది.
ప్రస్తుతం 57 కేసులు..
చనిపోయిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 77కి చేరినట్లు వైద్యారోగ్యశాఖ స్పష్టంచేసింది. వారిలో 6గురు మృతిచెందగా..14 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 13 మంది సోమవారం డిశ్చార్జి కాగా.. గతంలో ఒకరు వైరస్ నుంచి బయటపడి ఇంటికి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 57 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు.
ఇంకెంత మంది ఉన్నారో..
రాష్ట్రంలో తొలి కరోనా మృతి సహా మొత్తం ఆరుగురూ దిల్లీలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న వారేకావటం వైద్యారోగ్యశాఖ అధికారుల్లో గుబులు పుట్టిస్తోంది. రాష్ట్రం నుంచి ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను తక్షణం ఐసోలేషన్ వార్డుకి తరలించారు. వారందరికీ శరవేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారితో సన్నిహితంగా ఉన్నవారికి కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శనివారం ప్రకటించిన కరోనా పాజిటివ్ కేసుల్లోనూ రెండు కుటుంబాలకు చెందిన వారు దిల్లీ వెళ్లినట్లు అధికారులు తెలిపారు. వారి నుంచి కుటుంబ సభ్యులందరికీ వైరస్ సోకినట్టు ఇప్పటికే వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి సహా... మృతులు ఎక్కడెక్కడ సంచరించారు.. వారికి చికిత్స అందించిన వైద్యుల వివరాలు.. ఆయా తేదీల్లో ఆస్పత్రికి వచ్చిన వారి సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. ఆ కార్యక్రమానికి వెళ్లివచ్చిన వారి నుంచి ఇతరులకు కరోనా సోకే ప్రమాదం ఉన్నందున..స్వచ్ఛందంగా వారే వచ్చి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇవీచూడండి: తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య