హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో 5వ "అంతర్జాతీయ అగ్రానమి కాంగ్రెస్ - 2021(agronomy congress 2021)" జరుగుతోంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆగ్రానమి సంయుక్త ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సును తొలి రోజు దిల్లీ నుంచి భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర ఆన్‌లైన్‌లో వేదిక ప్రారంభించి అధ్యక్షోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో భారత్‌సహా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, బ్రెజిల్, ఇజ్రాయెల్, పిలిప్పీన్స్, నేపాల్, శ్రీలంక, ఆఫ్రికా తదితర 22 దేశాల నుంచి ప్రత్యక్షంగా 500 మంది, ఆన్‌లైన్‌లో 800 మంది మొత్తం 1300 మంది శాస్త్రవేత్తలు, పరిశ్రమ వర్గాలు, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు. సదస్సులో భాగంగా వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు పాడి, మాంసం రంగాలకు సంబంధించిన పరికారాలు, ఉత్పత్పులతో స్టాళ్లను ప్రదర్శించారు.
భారత ఆర్థిక వ్యవస్థపై అత్యంత ప్రభావం చూపుతున్న వ్యవసాయ అనుబంధ రంగాల బలోపేతం, రైతాంగం ఆదాయాలు రెట్టింపు, మూడు రెట్లు పెంచాలంటే ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాలపై చర్చిస్తున్నారు. నూనెగింజల ఉత్పత్తిలో దేశం వెనుకబడి ఉందని.. ఈ విషయంలో రైతులు, శాస్త్రవేత్తలు సహా అందరూ దృష్టి సారించాలని భారత వ్యవసాయ పరిశోధనా మండలి డీజీ త్రిలోచన్ మహాపాత్ర పిలుపునిచ్చారు. ప్రపంచంలో అనూహ్యంగా తరిగిపోతున్న నీటి వనరులు, భూ వనరులు మరింత క్షీణించకుండా తుపాన్లు, భారీ వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు, చలి వంటి వాతావరణ మార్పులు తట్టుకునే విధంగా కొత్త వండగాల సృష్టి, నవీన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం, నూతన వ్యూహాల రూపకల్పన జరగాలని ఆసన్నమైందని రాణిలక్ష్మీభాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కులపతి డాక్టర్ పంజాబ్‌సింగ్ అభిప్రాయపడ్డారు.
2050 నాటికి ప్రపంచ జనాభా దృష్ట్యా అదనంగా 60 శాతం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగాల్సిన ఉందని నిపుణులు ప్రస్తావించారు. సహజ వనరులు సద్వినియోగం చేసుకుంటూ అధిక ఉత్పత్తి, ఉత్పాదకత సాధించాలంటే 30 శాతం వృథా అరికట్టాలని సూచించారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు, ఇతర కీటక నాశినులు చల్లడంలో డ్రోన్ టెక్నాలజీ వాకడం పెరగాల్సి ఉందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి, ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆగ్రానమి ఛైర్మన్ డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు పేర్కొన్నారు.
అంతర్జాతీయ సదస్సుకు అన్నదాత పత్రిక మీడియా భాగస్వామిగా వ్యవహరిస్తోంది. సదస్సుపై రూపొందించిన అన్నదాత ప్రత్యేక సంచికను... ప్రముఖులు ఆవిష్కరించారు. వివిధ విభాగాల్లో నిష్ణాతులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆధునిక వ్యవసాయ యంత్రాలు, ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.
ఇదీ చూడండి: