Government Doctors Suspension : ప్రభుత్వ వైద్యులుగా ఉంటూ.. దీర్ఘకాలంగా అనుమతి లేకుండా విధులకు డుమ్మా కొడుతున్న వారిపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. బోధనాసుపత్రుల్లో పని చేస్తున్న 38 మంది స్పెషలిస్టు వైద్యులను ఉద్యోగాల నుంచి తొలగించింది. ఈ మేరకు వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.
38 మందిపై వేటు..
Doctors Suspension for Absence : 2001 నుంచి ఇప్పటివరకు 20 సంవత్సరాల్లో మొత్తం 43 మంది వైద్యులు అనుమతి లేకుండా గైర్హాజరయ్యారు. వీరికి ఇప్పటికి మూడుసార్లు తాఖీదులు జారీచేశారు. అయినా వారి నుంచి స్పందన లేదు. ఈ విషయంపై గతేడాది అక్టోబరు 14న ఒక విచారణ కమిటీని వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో 38 మందిని తొలగించాలని సిఫారసు చేసింది. దీంతో వారిని తొలగించినట్లు వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి తెలిపారు.
సొంత ఆసుపత్రులు..
Government Doctors Suspension in Telangana : సాధారణంగా ప్రభుత్వ వైద్యంలో పనిచేసే స్పెషలిస్టు వైద్యులు హైదరాబాద్, ఆ పరిసరాల్లో విధులను కోరుకుంటారు. తొలగించిన 38 వైద్యుల్లో 29 మందికి హైదరాబాద్‌లో సేవలందించడానికి పోస్టింగ్ ఇచ్చినా, పనిచేయడానికి ఆసక్తి చూపకపోవడం గమనార్హం. దీనికి కారణాలేమిటనేది వైద్యశాఖ విశ్లేషించింది. అందరూ ప్రభుత్వ వైద్యకళాశాలలు, అనుబంధ బోధనాసుపత్రుల్లో సహాయ ఆచార్యులు, సహ ఆచార్యుల హోదాల్లో ఉన్నవారు. బాగా డిమాండ్ ఉన్న స్పెషలిస్టులు. వీరిలో ఎక్కువమంది సొంతంగా ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. కొందరు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కీలకమైన విభాగాలకు అధిపతులు పనిచేస్తున్నారు. మరికొందరు విదేశాలకు వెళ్లినట్లుగా ఆరోగ్యశాఖ గుర్తించింది. పూర్తిస్థాయిలో ప్రైవేటులోనే వైద్య సేవలందించడం ద్వారా అధిక మొత్తంలో ఆదాయం పొందుతున్నామని కొందరు వైద్యులు పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.