హైదరాబాద్‌లో ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న మూడు ముఠాలను సికింద్రాబాద్ కార్ఖానా పోలీసులు అరెస్ట్ చేశారు. ఖరీదైన బైకులే లక్ష్యంగా చేసుకుని రెక్కీ నిర్వహించి మరీ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం మూడు ముఠాల్లో 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. నిందితుల నుంచి 77 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
నిర్మానుష్య ప్రాంతాల్లోని ఇళ్లలో ఉన్న ఖరీదైన ద్విచక్రవాహనాలపై కన్నేసి.. అదును చూసి చోరీ చేస్తున్నారని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. దొంగలించిన వాహనాలను హిందూస్థాన్ పార్శిల్ సర్వీసులో నిజామాబాద్ తరలిస్తున్నారని వెల్లడించారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా వివిధ ప్రాంతాల్లో వీటిని విక్రయిస్తున్నారని వివరించారు.
ముఠా సభ్యులపై పలు పోలీస్‌స్టేషన్లలో కేసులున్నాయని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ప్రధాన నిందితులు అమీనుల్లా, అక్బర్, మెషిన్ గ్యాంగ్‌లలో 15 మంది అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని వెల్లడించారు.