Grand Nursery Mela in Hyderabad : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన వేళ ప్రజల జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. అందులో ముఖ్యంగా ఆర్గానిక్ ఉత్పత్తుల వైపు మొగ్గుచూపడం ఒకటి. తినే ఆహారంపై ప్రజలు శ్రద్ధచూపడం మొదలుపెట్టారు. అప్పటి వరకు పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, పానీపూరి అంటూ జంక్ ఫుడ్ ఇష్టపడిన వాళ్లంతా.. కొవిడ్ రాకతో.. ఆర్గానిక్ కూరగాయలు, పండ్ల వైపు మళ్లారు. కానీ ఈ కాంక్రీట్ జంగల్‌లో ఎక్కడ చూసినా.. రసాయనపూరిత కూరగాయాలు, పండ్లు, ఆహార పదార్థాలే. వీటి బారి నుంచి బయటపడాలంటే ఉన్న ఏకైక మార్గం.. మనకు కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు మనమే పండించుకోవడం.
గ్రాండ్ నర్సరీ మేళా..
11th Grand Nursery Mela in Hyderabad : కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌లో మిద్దె తోటలపై ప్రజలకు అవగాహన పెరిగింది. సిటీలో ఉండే వాళ్లంతా తమ ఇంటిపైన.. అద్దెకు ఉండే వాళ్లు కూడా వారి యజమానుల అనుమతితో టెర్రస్ గార్డెన్ నిర్వహించడం మొదలు పెట్టారు. ఇలా టెర్రస్ గార్డెనింగ్ నిర్వాహకులను, వన ప్రేమికులను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో జాతీయ ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన జరుగుతోంది. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న ఈ గ్రాండ్ నర్సరీ మేళాను రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. స్టాళ్లలో ఉన్న మొక్కలు, ఎరువుల గురించి తెలుసుకున్నారు.
అందుకే వచ్చాను..
"మొక్కలు మనిషికి చాలా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తాయి. కాంక్రీట్ జంగల్‌లో బతుకుతున్న మనకు కిచెన్ గార్డెన్, టెర్రస్ గార్డెన్ వంటివి చాలా ప్రశాంతతను కలిగిస్తాయి. నేను ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకే కాదు.. నా ఇంటికి, ఆఫీసుకు, నా ఊరు కోసం, జిల్లా కోసం కావాల్సిన మొక్కలు కొనుక్కొని వెళ్లడానికి వచ్చాను. మా పురపాలక కమిషనర్, కౌన్సిలర్లను ఇక్కడికి పిలిచాను. వాళ్లతో కలిసి మాకు కావాల్సిన మొక్కలను ఎంపిక చేసుకున్నాం. కార్యాలయాల్లో, ఇంట్లో, రహదారి పక్కన నాటడానికి కావాల్సిన మొక్కలను తీసుకువెళ్తున్నాం. నగర ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీకు నచ్చిన మొక్కలను ఇక్కడి నుంచి కొనుగోలు చేయండి. చాలా మొక్కలపై రాయితీలు కూడా ఇస్తున్నారు."
- హరీశ్ రావు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి
మిద్దె తోటల నిర్వహణలో మెలకువలు..
Grand Nursery Mela Starts in Hyderabad : గ్రాండ్ నర్సరీ ప్రదర్శనలో 150 స్టాళ్లు కొలువుదీరాయి. ఈ కార్యక్రమంలో.. మిద్దె తోటల నిర్వహణపై ఔత్సాహికులకు అవగాహన కల్పిస్తున్నారు. మేళాలో పలు రకాల మొక్కలు, విత్తనాలు, ఎరువులు, పూలు, పండ్లు, కూరగాయల విత్తనాలు, అంట్లు, సేంద్రీయ, జీవన ఎరువులు, మల్చింగ్, పనిముట్లు, ఇతర సామగ్రి విక్రయించడంతో పాటు మిద్దెతోటల నిర్వహణలో ఔత్సాహికులకు మెలకువలు నేర్పిస్తున్నారు.
ఉత్పత్తులపై రాయితీ ..
Hyderabad Grand Nursery Mela: ప్రదర్శనలో వివిధ ఉత్పత్తుల కొనుగోలుపైనా రాయితీ ఇస్తున్నారు. వ్యవసాయం, ఉద్యాన నిర్వహణపై ఆసక్తి పెంచేందుకు విద్యార్థులకు 50 శాతం రాయితీతో ప్రవేశానికి అవకాశం ఇచ్చారు.
ఇదీ చదవండి : TERRACE GARDENING: మిద్దె తోటలు పెంచాలనుకుంటున్నారా.. మేము తోడుగా ఉంటాం..!