సాధారణంగా భవనాలు కట్టాలంటే పునాదులు తీసి.. పిల్లర్లు వేసేందుకు కనీసం నెల సమయం పడుతుంది.. అలాంటిది 28 రోజుల్లోనే ఆసుపత్రి నిర్మించేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు నగరంలోని సర్వజన ఆసుపత్రి వెనుక ఇండో అమెరికన్ సొసైటీ ఆధ్వర్యంలో 100 పడకల ఆసుపత్రిని కేవలం 28 రోజుల్లో పూర్తి చేసే లక్ష్యంతో పనులు చేపట్టారు. ఇప్పటికే 15 రోజుల పనులు కాగా.. ఆసుపత్రి ఓ రూపుకొచ్చింది. మద్రాస్ ఐఐటీ సాంకేతిక సహకారంతో రూ.3.5 కోట్లతో ప్రి ఫ్యాబ్రికేటెడ్ విధానంలో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు.
10 ఐసీయూ పడకలు, 90 పడకల జనరల్ వార్డు ఉండేలా చూస్తున్నారు. పది నుంచి పదిహేనేళ్లు వినియోగించుకోవచ్చు. అవసరం లేనప్పుడు భాగాలు విడగొట్టి వేరే ప్రాంతానికి తరలించవచ్చు. కొవిడ్ మూడో దశను ఎదుర్కోవడానికి ఇది ఉపకరించనుంది. రాష్ట్రంలో ఈ తరహా ఆసుపత్రిని నిర్మించడం ఇదే మొదటిసారని సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు తెలిపారు. అదే ఈ స్థాయిలో ఆసుపత్రిని సాధారణ పద్ధతిలో నిర్మిస్తే దాదాపు 6 నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది.
ఇదీ చదవండి: ఏ పండు కావాలో చెప్పు... హైటెక్ వాట్సాప్ వ్యభిచారంలో నిర్వాహకుల కోడ్ భాష