ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కింద 10 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తామని ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లలోనే ఈ అంశాన్ని ప్రస్తావించనుంది. మరో అయిదారు రోజుల్లో కోటా అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయనుంది. ఉన్నత విద్యా కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ కోటా తప్పకుండా అమలు చేయాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి ఇప్పటికే ప్రకటించింది. దీనిపై విద్యాశాఖ కార్యదర్శి, ఉన్నత విద్యామండలి అధికారులు ఇటీవలే చర్చించారు.
కోటా అమలు చేస్తే ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశాల కోసం ఆయా జీవోల్లో చేయాల్సిన మార్పులపై ఉన్నత విద్యామండలి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారం నుంచి జారీ అవుతాయి. ఆ నోటిఫికేషన్లలోనే కోటా అమలు నిర్ణయాన్ని పేర్కొంటారు. దరఖాస్తు ఫారంలో ప్రత్యేక కాలం కూడా ముద్రించాలని గురువారం జరిగిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్ల సమావేశంలో చర్చ జరిగింది. దీనివల్ల ఎంత మంది ఈడబ్ల్యూఎస్ కోటా కిందకి వస్తారో అన్న సమాచారం వస్తుందని, విద్యార్థులు ముందుగా ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రం సిద్ధం చేసుకుంటారని కొందరు ప్రస్తావించారు. ప్రభుత్వం జీవో విడుదల చేస్తే నిపుణులు, కన్వీనర్లతో ఓ కమిటీ వేసి దరఖాస్తు ఫారాల్లో చేయాల్సిన మార్పులు తదితర వాటిపై నిర్ణయం తీసుకుంటామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి చెప్పినట్లు సమాచారం.
దివ్యాంగుల రిజర్వేషన్ 5 శాతానికి పెంపు
గత ఏడాది వరకు సీట్ల భర్తీలో దివ్యాంగులకు 3 శాతం రిజర్వేషన్ ఉండేది. దాన్ని 5 శాతానికి పెంచాలని గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈక్రమంలో వచ్చే విద్యా సంవత్సరం ఆ తీర్పునకు అనుగుణంగా రిజర్వేషన్‌ను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కూడా కొద్ది రోజుల్లో జీవో జారీ అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.
ఇవీ చూడండి:దావోస్లో మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం