వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. అనంతరం జరిగిన పరిణామాలు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో వైకాపా మద్దతు కొరడం, ఇటీవల మంత్రి తలసాని వరుసగా విజయవాడలో పర్యటనలు ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఏపీ రాజకీయాలపై స్పందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని చెప్పుకొచ్చారు.
చక్రం తిప్పలేరు
మీడియాతో ఇష్టాగోష్టిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. రానున్న ఎన్నికల్లో ఏపీలో వైకాపా గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. ఏపీ సీఎంపై విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు వందశాతం ఓడిపోవడం ఖాయమన్నారు. చంద్రబాబు దిల్లీలోనే కాదు, అమరావతిలో కూడా చక్రం తిప్పలేరని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
చంద్రబాబు కలలో కేసీఆరే..
హైదరాబాద్లో ఆస్తులు ఉన్న తెదేపా నాయకులు, మద్దతుదారులను తెరాస వేధిస్తుందనే ఆరోపణలపై కేటీఆర్ స్పందించారు. చంద్రబాబుకు కూడా హైదరాబాద్లో ఆస్తులున్నాయి కదా.. ఆయన్ని ఏమైనా వేధిస్తున్నామా అన్నారు. కలలో కూడా చంద్రబాబు కేసీఆర్ను కలవరిస్తున్నారన్నారు.
జగన్ను కేసీఆర్ కలుస్తారు
పారిశ్రామిక వేత్తలు, గుత్తేదారులపై ఐటీ సోదాలు జరిగితే చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. బాబుకు బినామీలు ఉన్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ విషయంలో ఎన్ని భావోద్వేగాలను రెచ్చగొట్టినా ఆంధ్ర ప్రజలు పట్టించుకోరన్నారు. కలవాల్సిన సమయంలో జగన్ను కేసీఆర్ కలుస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు.