కారులో అసమ్మతి సెగలు
ఉమ్మడి జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలుండగా... ఇటీవలి ఎన్నికల్లో 9 స్థానాలు తెరాస కైవసం చేసుకుంది. కాంగ్రెస్ గెలిచిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా గులాబీకే జై కొట్టడం వల్ల అధికార పార్టీకి అడ్డులేకుండా పోయింది. కానీ సిట్టింగ్ ఎంపీ నగేష్‌పై ఎమ్మెల్యేలందరూ అసంతృప్తితో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మీని బరిలో దింపితే.. అదే సామాజిక వర్గంతోపాటు మహిళా కోటాను భర్తీ చేసినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అధినేత మాత్రం ఆచితూచి వ్యవహరించి నగేష్ అభ్యర్థిత్వాన్నే తిరిగి ఖరారు చేశారు. అసమ్మతి సెగలు చల్లార్చే బాధ్యత జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అప్పగించారు. సద్దుమణిగినట్టే కనిపిస్తున్నా... అంతర్గతంగా రగులుతూనే ఉందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి.
హస్తంలో ఐక్యతా రాగం
ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం... జిల్లా నేతలందరి అభిప్రాయం మేరకే మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్ పేరు ఖారురు చేసింది. అభ్యర్థిత్వం ముందుగానే ప్రకటించటం, జిల్లా నేతలంతా ఒక్కతాటిపైకి రావడం, పార్టీకి ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకుతో విజయం సాధిస్తామనే ధీమా హస్తం నేతల్లో కనిపిస్తోంది. రమేష్ రాఠోడ్ గతంలో తెదేపా నుంచి ప్రాతినిథ్యం వహించారు. ఈ ఎన్నికల్లో సైకిల్ పోటీలో లేనందున! తెలుగు తమ్ముల మద్దతు కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు.
మార్పుపై కమలం ధీమా
ఇటీవలే కమలతీర్థం పుచ్చుకున్న ముథోల్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావును ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది భాజపా. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో భాజపాకు కొంత వరకు పట్టుంది. పార్టీకి దూరమైన శ్రేణులన్నింటినీ సొంతగూటికి చేర్చేందుకు కమల దళం ప్రయత్నిస్తోంది. తెలంగాణలో శాసనసభ ఎన్నికల అనంతరం వచ్చిన మార్పు తమకు ఉపయోగపడుతుందన్న విశ్వాసంతో ఉన్నారు కమలనాథులు.
ప్రచారంలో ముందున్న కాంగ్రెస్... త్వరలో రాష్ట్ర, జాతీయ నేతలతో ప్రచారానికి ప్రణాళిక రూపొందిస్తోంది. గూలాబీ అధినేత వ్యూహ రచన పైనే తెరాస శ్రేణులు ఆశలు పెట్టుకున్నాయి. మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రుల పర్యటనకు భాజపా కసరత్తు చేస్తోంది. వ్యూహ ప్రతి వ్యూహాలతో పార్టీలు ప్రజలను ఆకర్షిస్తుంటే... ఓటరు మహాశయులు ఎవరికి జై కొడతారో వేచి చూడాలి.
ఇవీ చూడండి:భువనగిరి కోటపై ఎవరి జెండా..?