ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లక్కారం గ్రామంలో ఓ మహిళపై అడవి పంది దాడి చేసింది. లక్కారానికి చెందిన సాధన గంగమ్మ వ్యవసాయక్షేత్రంలో బెండకాయలు కోస్తుండగా అకస్మాత్తుగా అడవి పంది దాడి చేసింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు గంగమ్మను ఉట్నూర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అడవి పంది దాడి చేస్తున్నప్పుడు.. సమీపంలో ఉన్న కుక్కలు తరిమివేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందని వారు తెలిపారు.
కుక్కలు తరమడం వల్ల అడవి పంది ప్రమాదవశాత్తు బావిలో పడింది. గ్రామస్థుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న అటవీశాఖ అధికారులు బావిలో నుంచి అడవిపందిని బయటకు తీశారు. బయటకొచ్చిన కాసేపటికే పంది మృతిచెందగా... ఎఫ్ఆర్ఓ అనిత సమక్షంలో పంచనామా నిర్వహించి అటవీప్రాంతంలో పూడ్చివేశారు.
- ఇవీ చూడండి: పౌరహక్కుల నేత వరవరరావుకు కరోనా పాజిటివ్