Cheating in Degree Exams: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న కాకతీయ విశ్వవిద్యాలయ దూరవిద్య డిగ్రీ పరీక్షలో చూచి రాతలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. శుక్రవారం డిగ్రీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1 పరీక్షను 135 మంది రాయాల్సి ఉండగా... 108 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలో అభ్యర్థులు చీటీలు, ఎదుటి వారి సమాధాన పత్రాలు చూస్తూ పరీక్ష రాశారు.
చూచి రాతల కోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.1500 వసూల చేసినట్లు పలువురు ఆరోపించారు. డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఆరుగురు అభ్యర్థులను పరీక్ష రాయనీయక పోవడంతో వారు తొలుత పరీక్ష కేంద్రం ఎదురుగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్లగా అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ భాషాను కలిసి కళాశాల సిబ్బంది నిర్వకాన్ని వివరించారు.
ఆయన సూచన తర్వాతే ఆ విద్యార్థులనూ పరీక్షకు అనుమతించారు. అభ్యర్థులు పరీక్ష రాయడంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఒక్కో అభ్యర్థి నుంచి చూచిరాతల కోసం రూ.1500 వసూలు చేసిన విషయమై ప్రిన్సిపల్‌ను వివరణ కోరగా... త్వరలో జరగనున్న ఆలూమిని కార్యక్రమం కోసం కళాశాల అభివృద్ధి నిధి పేరిట అభ్యర్థులు వారి ఇష్ట పూర్వకంగా డబ్బులు ఇచ్చారని... ఎవరిని బలవంతం చేయలేదని చెప్పారు. అభ్యర్థులను లోనికి అనుమతించని వ్యవహారం అడిషనల్ కలెక్టర్ ఫోన్ చేసి చెబితే గానీ తనకు తెలియదని పేర్కొనడం కొసమెరుపు. ఇది చదవండి:విద్యాశాఖలో ఖాళీల భర్తీకి రంగం సిద్ధం