DCCB scam in Adilabad News: ఆదిలాబాద్ డీసీసీబీ కుంభకోణంపై ముమ్మర విచారణ కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ బేల బ్రాంచిలో... నెల రోజుల కిందట రూ.2.85కోట్ల కుంభకోణం జరగ్గా 11 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు ఉన్నతాధికారులతో విచారణ కమిటీ నియమించింది. కేసును ఆర్బీఐ నిబంధనల మేరకు సీబీఐకి అప్పగించింది. సస్పెండైన 11 మంది ఉద్యోగుల్లో ఇప్పటికే ఐదుగురిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
తాజాగా వారిలో ఇద్దరికి బెయిల్ మంజూరుకాగా... ప్రధాన సూత్రదారులైన శ్రీపతి కుమార్, బండిరమేష్, రాజేశ్వర్ ఇంకా జైల్లోనే ఉన్నారు. దుర్వినియోగమైన బ్యాంకు సొమ్మును ఎట్టిపరిస్థితుల్లో రికవరీ చేయాల్సిందేనన్న ఆర్బీఐ నిబంధనల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు కోటి 22 లక్షలు రికవరీ చేసుకున్నట్లు ఆదిలాబాద్ డీసీసీబీ సీఈవో శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు.
'కుంభకోణంలో 11 మంది ఉద్యోగుల సస్పెండ్ అయినా ప్రాథమిక విచారణలో ఐదుగురు సిబ్బందిపైనే ప్రధాన ఆరోపణలు వచ్చాయి. మిగిలిన ఆరుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలా..? కొనసాగించాలా..? అనేదానిపై ఇవాళ జరగనున్న పాలకవర్గం సమావేశం తీర్మానించే అవకాశముంది.' -శ్రీధర్‌రెడ్డి, డీసీసీబీ సీఈవో, ఆదిలాబాద్
సీబీఐ, పోలీసులు వేర్వేరుగా చేస్తున్న విచారణ పూర్తయితే... ఛార్జిషీట్ దాఖలయ్యే అవకాశం ఉంది. అప్పటివరకైనా అక్రమాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన ఉద్యోగులపై సస్పెన్షన్ కొనసాగుతుందా? లేదో వేచిచూడాలి.
అసలేం జరిగిందంటే...
DCCB Bank scam: బేల బ్రాంచిలో స్టాఫ్ అసిస్టెంట్ కం క్యాషియర్‌గా పనిచేసే శ్రీపతి కుమార్ అదే బ్రాంచి వేునేజర్ రాజేశ్వర్, అసిస్టెంట్‌మేనేజర్ రణిత ఐడీలతో గతేడాది సెప్టెంబర్ 13 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28వరకు విడతలవారీగా రూ.2.86కోట్లు తన కుటుంబీకుల ఖాతాల్లో జమచేశారు. అక్కడితో ఆగకుండా ఆదిలాబాద్‌లోని డీసీసీబీ, ఆదిలాబాద్ గ్రామీణం, భీంపూర్, జన్నారంలో పనిచేసే నలుగురు మేనేజర్లు సహా 11 మంది ఉద్యోగుల ఖాతాల్లోకి డబ్బులు మళ్లించాడు. గుట్టుచప్పుడుకాకుండా జరిగిన ఈ ఘటనను అధికారయంత్రాంగం పసిగట్టలేకపోయింది. ఈనెల 7న బ్యాంకు తరఫున చార్టెడ్ అకౌంటెంట్ జరిపిన సాధారణ ఆడిట్‌లో రూ.2.86కోట్ల వోచర్లు లేకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఆ తరువాత డీసీసీబీ డిప్యూటీ జనరల్ మేనేజర్లు నాగాంజలి, శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విచారణలో డబ్బులు కాజేసిన విషయం వెళ్లడైంది. ఆర్థిక నేరంగా భావించిన ఉన్నతాధికారులు ఆయా బ్యాంకుల్లోని నలుగురు మేనేజర్లు సహా 11 మంది ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
ఇవీ చదవండి:
- డీసీసీబీలో రూ.2.86 కోట్ల కుంభకోణం.. 4మేనేజర్లు సహా 11 మంది ఉద్యోగులపై వేటు
- ఎస్సై నోటిఫికేషన్ వచ్చేసింది... ఇంజినీర్ పోస్టులకు కూడా..