ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఆర్టీసీ రాజధాని బస్సుకు.. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఇచ్చోడ గ్రామ సమీపంలోకి రాగానే బస్సు వెనుక టైర్నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్.. టైర్ పేలిపోయే ప్రమాదం ఉందని.. బస్సును నిర్మల్ డిపోకు తరలించారు.
ఎలాంటి ప్రమాదం సంభవించకుండా నిర్మల్‌కు బస్సు చేరుకోవడం వల్ల ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ బస్ డిపోలో మెకానిక్ అందుబాటులో లేకపోవడం వల్ల ప్రయాణికులు దాదాపు గంటకు పైగా డిపోలోనే వేచి ఉండాల్సి వచ్చింది. బస్సుకు మరమ్మతులు చేయడం మరింత ఆలస్యం అవుతుందని నిర్మల్ డిపో నుంచి వేరే బస్సును ఏర్పాటు చేసి ప్రయాణికులను హైదరాబాద్ పంపించారు.