ఇదిగో చలివేంద్రం దగ్గర నీళ్లు పట్టుకుంటున్న ఈయనదో బాధ. ఆసుపత్రిలో ఉన్న కుటుంబీకులకు .. తాగేందుకు నీరులేక ఇలా బయట ఓ స్వచ్చంద సంస్థ ఏర్పాటుచేసిన చలివేంద్రం నుంచి తీసుకెళ్లాల్సిన దుస్థితి. ఆసుపత్రిలో తాగేందుకు నీటి వసతిలేక వెంటబాటిళ్లు తెచ్చుకుంటున్న పరిస్థితి. రోగులు, వైద్య సిబ్బందే కాదు. ఆసుపత్రిలో సరిపడా నీటి సరఫరా జరగడంలేదు. ఫలితంగా మరుగుదొడ్లుకు సైతం తాళాలు వేయాల్లివస్తోంది. కాలకృత్యాల కోసం ఆసుపత్రి బయటకు వెళ్లాల్సిందే. ఇప్పటికే పూర్తిస్థాయి వైద్యులు, సిబ్బందిలేక .. ప్రాభవం తగ్గుతున్న రిమ్స్.. కనీస వసతుల కల్పనకు సైతం నోచుకోవడంలేదు.
రాష్ట్రంలో ఏకైక స్వయంప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ వైద్యకళాశాలగా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి పేరుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే 120 కోట్ల రూపాయలతో నిర్మాణం పూర్తి చేసుకొని 2007లో అప్పటి సీఎం వైఎస్సార్ చేతుల మీదుగా ప్రారంభమైంది. అప్పటి నుంచి సమస్యలే. వైద్యుల నియామకమే కాదు.. చిన్నచిన్న రోగాలకు సైతం హైదరాబాద్, మహారాష్ట్రలోని నాగపూర్‌కు రిఫర్‌చేసే రిఫరల్ ఆసుపత్రిగా మారింది. సరైన నీటి సౌకర్యం లేదు. రిమ్స్ అధికారయంత్రాంగంగానీ ఇటు జిల్లా ప్రజాప్రతినిధులు పట్టించుకున్న దాఖల్లాల్లేవు. ప్రతిరోజూ 4లక్షల గ్యాలన్ల నీరు కావాల్సి ఉండగా .. ప్రస్తుతం కేవలం 70వేల గ్యాలన్ల నీటి సరఫరానే అవుతోంది. ఫలితంగా శస్త్రచికిత్సలకే కాదు.. వార్డుల్లో రోగులు ఉపయోగించే మరుగుదొడ్లకు సైతం నీరుసరఫరాచేయలేని దుస్థితి నెలకొంది.
వైద్యకళాశాలగా మారాక 200 పడకల చోట 500 పడకలకు స్థాయి పెరిగింది. రోజు 1500 నుంచి రెండువేల మంది రోగుల తాకిడీ పెరిగింది. అదే సమయంలో అటు కళాశాల, ఇటు ఆసుపత్రి నిర్వహణకు 215 మంది వైద్యులను భారత వైద్య మండలి మంజూరు చేసింది. కానీ ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న 98 మంది వైద్యులను మినహాయిస్తే.. ఇప్పుడు పనిచేస్తున్న వైద్యుల సంఖ్య కేవలం 13 మందే. మొత్తం 215 మంది వైద్యులు, ప్రొఫెసర్లు, అసిస్టెంటు ప్రొఫెసర్లకుగాను.. 126 మంది వైద్య పోస్టులు భర్తీ కాలేదనేది అధికారిక లెక్కలే చెబుతున్నాయి. దేశంలో ఏ వైద్యకళాశాలకైనా త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం ఉంటుంది. ఆదిలాబాద్ రిమ్స్‌కు ఒకే ఫేజ్ సరఫరా అవుతోంది. వార్డుల్లోఉండే ఏసీలు, ఫ్యాన్ల పనితీరును పట్టించుకోవడమే మానేశారు. ఇటీవల వైద్యారోగ్యశాఖామంత్రి హరీష్‌రావు సందర్శించి వెళ్లినా.. మార్పురాలేదు.
జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులెవరూ రిమ్స్ యోగక్షేమాలను పట్టించుకోవడంలేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆదిలాబాద్‌ను తరచూ తెలంగాణ కశ్మీరంగా అభివర్ణించే సీఎం కేసీఆర్ మాటలు ఆచరణలోకి రావాలంటే.. ముందు ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణపై ప్రభుత్వం దృష్టిసారించాల్సి ఉంది.
ఇదీ చూడండి: