బిడ్డలను కంటికి రెప్పలా చూసుకున్న మాతృ ప్రేమ. భర్త పట్టించుకోకున్నా సంతానాన్ని చంకనేసుకున్న మమకారం. గాలి వస్తే పడిపోయేలా ఉన్న తడకల ఇళ్లు. బాహ్యప్రపంచపు పోకడలు తెలియని ఆదివాసీ అమాయకత్వం. ఆస్తిపాస్తులంటూ ఏమీలేని దయనీయం. వెరసి ఓ మాతృమూర్తి జీవితం. అయినా ఆనందంగానే నెట్టుకొస్తున్న తరుణంలో.. నాగుపాము రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరు పిల్లలను మృత్యుఒడిలోకి చేర్చింది. నిర్జీవంగా పడి ఉన్న బిడ్డలను చూసి గుండెలవిసేలా రోదించింది. కాపాడాలని ప్రార్థించింది. ఆమె మొర ఎవరూ వినలేదు. జరగరానిది జరిగిపోయింది. ఇద్దరు పిల్లలు బతికున్నప్పుడే కాదు... ఇప్పుడు చచ్చిపోయిన తరువాత కూడా వారిని పలకరించేవారూలేరు.
సత్తువనంతా కూడగట్టుకొని నలుగురు పిల్లలతో అడుగులో అడుగేస్తున్న ఈ మాతృమూర్తి పేరు ఆత్రం కవిత. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మారుతీపాటగూడ. అటవీప్రాంతానికి ఆనుకొని ఉన్న ఈ ఇళ్లే ఆమె ఏడంతస్థుల భవనం. మూడునాలుగు పాత చీరెలు. నాలుగైదు ప్లేట్లు. వంటకర్రతో వేసుకున్న పూరి గుడిసె. గాలికి ఎగిరెగిరి పడే గూనపెంకలు. ఇవే ఆమె ఆస్తిపాస్తులు. కుమురంభీం జిల్లా కెరమెరి మండలం అక్షయ్‌నగర్‌కు చెందిన ఆత్రం రాజుతో 18ఏళ్ల కిందట పెళ్లయింది. ఏడుగురు సంతానం. భర్త పట్టించుకోకపోవడంతో పిల్లలతో సహా కొంతకాలంగా తల్లిగారి ఊరైన మారుతీపాటగూడకు వచ్చి ఉంటోంది. కనీసం మంచాలు సైతం లేని ఆమె ఎప్పటిమాదిరిగానే ఈనెల 11న రాత్రి పిల్లలతో.. నేలపైనే విశ్రమించింది. గాఢనిద్రలో ఉన్న సమయంలో ఆ ఇంట్లోకి నాగుపాము దూరింది. 13ఏళ్ల భీంరావు, నాలుగేళ్ల వయస్సున్న దీపను కాటేసింది. అరుపులతో లేచేసరికి పాము పక్కనే ఉన్న పొలంలోకి జారుకుంది. ఆలస్యంగా వచ్చిన అంబులెన్సులో ఆసుపత్రికి తరలించేలోగా ఇద్దరు పిల్లలు ప్రాణాలు విడిచారు.
ఉట్నూర్‌లో శవపంచనామ అనంతరం... మానవతావాదుల సాయంతో అంత్యక్రియలు పూర్తిచేసిన కవిత.. పిల్లల జ్ఞాపకాలను తలుచుకుంటూ ఏడుస్తూ కాలం వెళ్లదీస్తోంది. ఆదివాసీల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడిన ఐటీడీఏ అధికారులు నయాపైసా సాయం చేయలేదు. ప్రజాప్రతినిధులెవరూ పలకరించలేదు. ఇద్దరి పిల్లల ప్రాణాలు పోతే అధికారులు మాటవరుసకైనా పలకరించకపోవడం కవిత కుటుంబాన్నే కాదు.. మారుతీగూడ ఆదివాసీలను కుంగదీస్తోంది.
'ఇంటికి రేకులు లేవు సార్. తడకలతో ఇంటిని నిర్మించుకున్నాను. మంచాలు లేవు. పెద్దకొడుకు, కూతురిని పొగొట్టుకున్నాను. నా పిల్లలకు దేవుడే దిక్కు సార్.' -కవిత, బాధితురాలు
'ఇద్దరు పిల్లలు పాము కాటుతో చనిపోయారు. శవపంచనామ కోసం ఉట్నూరు తీసుకెళ్లాం. పీవో, ఎంపీడీవో, కలెక్టర్ ఎవరూ వస్తలేరు. కనీసం సర్పంచ్, ఎమ్మెల్యే కూడా వచ్చి చూస్తలేరు. ఇద్దరు చనిపోయినా ఎవరూ రావట్లేదు. మావి ప్రాణాలు కాదా?'-మడావి జంగు, మారుతీపాటగూడ
ఇవీ చదవండి: