Heavy Rains in Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వానలతో తడిసి ముద్దవుతోంది. మూడురోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రధానంగా హిందువుల తొలి ఏకాదశి పూజలు ఇళ్లకే పరిమితం కాగా.... ముస్లీం బక్రీద్ ప్రార్థనలు ఈద్గాల వద్ద చేయలేని పరిస్థితి ఏర్పడింది. వాగులు, వంకలు పొంగటంతో.. రోడ్లు ధ్వంసమై రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. పలు చోట్ల ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి.. మరికొన్ని చోట్ల నివాసాలు కూలిపోయి.. ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులు జలకళను సంతరించుకోగా.. కుంటాల, పొచ్చర, గాయత్రి, కనకాయి జలపాతాలు కనువిందు చేస్తున్నాయి.
నిర్మల్ జిల్లాలో అత్యధిక వర్షాపాతం..: అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 13.7 సెం.మీ. వాన కురవగా.. ఇదే జిల్లాలోని తానూరు మండలంలో ఏకంగా 21.8.సెం.మీ. వర్షపాతం నమోదైంది. వర్షాలతో జిల్లాలోని రహదారులు జలమయమయ్యాయి. వర్ష ప్రభావిత ప్రాంతల్లో రెండో రోజు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. పట్టణంలోని శాంతినగర్, శివాజీ చౌక్ ప్రాంతాల్లో మోకాలెత్తు వరద నీటిలో పర్యటించి డ్రైనేజీ పూడిక తీయాలని, రహదారులపై వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా పగడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. గతేడాది వరద నీటిలో మునిగిన జీఎన్ఆర్ కాలనీకి వెళ్లి స్థానికులకు మనోదైర్యాన్ని ఇచ్చారు. మరోవైపు.. ముధోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో చెరువులు అలుగులు పారుతున్నాయి. అలుగు ప్రవాహాల వద్ద పెద్ద ఎత్తున చేపలు కొట్టుకుపోతున్నారు. ఈ క్రమంలో చిన్నాపెద్దా లేకుండా ఉత్సాహంగా.. చేపలు పడుతున్నారు.
ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత..: గోదావరి, పెన్‌గంగ, ప్రాణహిత, పెద్దవాగుల్లోకి భారీగా కొత్తనీరు వచ్చి చేరుతుంది. కడెం ప్రాజెక్టు నీటిసామర్థ్యం 700 అడుగులకు గాను 692 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ఇక్కడ 9 గేట్లు ఎత్తి 63వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వరద ప్రవాహం ఎక్కువ ఉన్నందున పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్వర్ణ ప్రాజెక్టు నీటి మట్టం 1183 అడుగులకు గాను నీరు చేరడంతో 3 గేట్లు ఎత్తి 7200 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. గడ్డెన్న ప్రాజెక్టు సామర్థ్యం 358.70 మీటర్లకు చేరడంతో 2 గేట్లు ఎత్తి 14200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు.
కుమురంభీం జిల్లాలో నిలిచిన రాకపోకలు..: కుమురంభీం జిల్లాలోని చింతలమానేపల్లి, పెంచికల్‌పేట, బెజ్జూరు, తిర్యాణి, కౌటాల, దహేగాం మండలాలతో పాటు ఉట్నూర్ ఏజెన్సీలోని సిరికొండ, ఇంద్రవెల్లి, జైనూర్, నార్నూర్, సిర్పూర్(యు) మండలాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జైనురు మండలంలోని చింతకర్ర వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో వంతెన నిర్మాణానికి చెందిన 20 లక్షల విలువ గల సామగ్రి కొట్టుకుపోయింది. కుమురంభీం, వట్టి వాగు ప్రాజెక్టులలో భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. అప్రమత్తమైన అధికారులు వట్టివాగు ప్రాజెక్టు 6 గేట్లు, కుమురంభీం ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూంలు ఏర్పాటుచేశారు. ప్రమాదకర వాగుల వద్ద కొంతమంది పోలీసులు కాపలా కాస్తున్నారు. అత్యవసర పనులు ఉంటేనే ప్రజలు బయటకి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో వరదలు..: మంచిర్యాల జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వేమనపల్లి మండలంలో నీల్వాయి, రాచర్ల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రాణహిత వరద గ్రామాల చుట్టూ చేరడంతో ప్రజలంతా బిక్కుబిక్కుమంటున్నారు. భీమిని, కన్నేపల్లి మండలాల్లో జలాశయాలు నిండుకోవడంతో పాటు వాగులు ఉప్పొంగుతున్నాయి. చెన్నూర్ పట్టణంలో లోతట్టు ప్రాంతాలలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. గాలికుంట చెరువు నిండిపోవడంతో పుప్పాల హనుమాన్ వీధితో పాటు పలు వీధుల్లోనీ ఇళ్లలోకి వరద నీరు చేరింది. విద్యుత్ అంతరాయం కూడా తోడవ్వటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పట్టణంలోని రహదారులన్నీ నీట మునిగాయి. బతుకమ్మ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
సింగరేణిపై వర్ష ప్రభావం..: సింగరేణి వ్యాప్తంగా అన్ని ఉపరితల గనులలో వర్ష ప్రభావం కనిపించింది. కొన్ని గనుల్లో రహదారులు కొట్టుకపోయాయి. వరద నీరు గనుల్లోకి చేరడంతో అధికారులు నష్ట నివారణ పనులను చేపట్టారు. శ్రీరాంపూర్‌లోని రెండు ఉపరితల గనుల్లో రోజుకు 12 వేల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా.. 9 వేల 327 టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. మందమరి ఏరియాలో రెండు గనులలో 11 వేల 538 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాల్సి ఉండగా.. 8 వేల 61 టన్నుల ఉత్పత్తి చేశారు. బెల్లంపల్లి ఏరియాలోని 8654 టన్నులకు గానూ.. 2003 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధ్యమైంది. శ్రీరాంపూర్ ఏరియాలోని కోతుల మోరి నుంచి వచ్చే కాలువ నీరు గండిపడి ఉపరితల గనిలోకి చేరడంతో వాహనాలు లోపలికి వెళ్లకుండా రహదారులు దెబ్బతిన్నాయి. మిగతా ఉపరితల గనులలో రహదారులన్ని బురదమయం కాగా.. భారీ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో 7 కోట్ల విలువైన 24 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడినట్లు అధికారులు అంచనా వేశారు.
ఇవీ చూడండి: