వానొస్తుందంటే చాలు ఆదిలాబాద్ జిల్లా రైతుల వెన్నెముకలో దడ పుడుతోంది. ఎక్కడ భారీ వర్షం కురిసి వరద ముంచెత్తుతుందోనని.. ఇప్పుడిప్పుడే వేసిన పంటంతా నీటిపాలైపోతుందేమోనని వణికిపోతున్నారు. గత నెలలో కురిసిన వానతో నష్టపోయిన కర్షకులు.. నేడు రేపు భారీ వర్షాలున్నాయన్న వాతావరణశాఖ ప్రకటనతో భయాందోళనకు గురవుతున్నారు.
90,150 ఎకరాల్లో పంట నష్టం
గత నెలలో పోటెత్తిన వరదలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 90,150 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇందులో అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 43,601 ఎకరాల్లో పంట వరదపాలైంది. నిర్మల్ జిల్లాలో 24,211 ఎకరాల్లో, ఆదిలాబాద్ జిల్లాలో 15,380 ఎకరాల్లో, మంచిర్యాల జిల్లాలో 6,958 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయశాఖ నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదించినా ఇప్పటివరకు ఎలాంటి పరిహారం అందలేదు.
పని చేయని బీమా పథకం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంటల బీమా, వాతావరణ బీమా పథకం పనిచేయడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రెండేళ్ల కిందట మంజూరైన వాతావరణ బీమా పథకం డబ్బులు ఇప్పటికీ అందలేదు. జిల్లాలో ఎదురులేని రాజకీయ శక్తిగా తెరాస ఎదిగినా రైతులకు బీమా డబ్బులు ఇప్పించే ప్రయత్నమేదీ కొనసాగడంలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహా శాసనసభ్యులు భరోసా ఇచ్చినా ఎలాంటి సాయం అందలేదు. రాజకీయాలకతీతంగా రైతుల గోడును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తే తప్ప... పరిహారం అందే పరిస్థితి లేదు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేది ఎవరనేదే ప్రశ్నార్థకంగా మారింది.
ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు (మి.మి.లలో)
జిల్లా | సాధారణం | కురిసింది | వ్యత్యాసం |
ఆదిలాబాద్ | 721,1 | 841,9 | 17శాతం అధికం |
నిర్మల్ | 674.5 | 858.9 | 27శాతం అధికం |
కుమురంభీం | 713.6 | 869.0 | 22శాతం అధికం |
మంచిర్యాల | 713,2 | 678.2 | 5శాతం తక్కువ |