ఆదిలాబాద్ జిల్లాలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 71కి చేరుకుంది. వీరిలో వ్యాధి తీవ్రతకు అనుగుణంగా వైద్యశాఖ 33 మందిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించింది. మరో 33 మంది హోంఐసోలేషన్‌లోనే ఉంచింది. ఇద్దరిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితుల వినతి మేరకు మరో ముగ్గురిని హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
నాణ్యత లేని భోజనం..
రిమ్స్ ఆసుపత్రిలో ఉన్న 33 మంది బాధితుల వైద్యం గాలిలో దీపంలా మారింది. కొంతకాలంగా రిమ్స్ డైరెక్టర్, మిగిలిన వైద్యుల మధ్య పొడచూపిన విబేధాలు వ్యాధిగ్రస్థుల పాలిట ప్రాణసంకటంగా మారాయి. రుచి, శుభ్రత లేని అల్పాహారం, భోజనంతోపాటు తాగు నీటి విషయంలో కూడా అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. మాగోడు పట్టించుకొండి సారూ అంటూ బాధితులు అభ్యర్థిస్తుంటే అలాకించే వారే కనిపించడంలేదు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం..
రిమ్స్ ఆసుపత్రిలోని రెండో అంతస్తులో ఆపరేషన్ థియేటర్, ఆరోగ్యశ్రీ వార్డు ఉన్నాయి. వీటి పక్కనే కేవలం ఓ పల్చటి గ్రీన్ నెట్‌ను మధ్యలో అడ్డంగా కట్టిన రిమ్స్ సిబ్బంది... శానిటైజేషన్ చేయాలనే కనీస నిబంధన మర్చిపోయారు. వీటికి తోడు విద్యుత్ సరఫరాలో అంతరాయం కూడా బాధితులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఐసోలేషన్ వార్డులో సరిగా విద్యుత్ లేనందున ఫ్యాన్లు తిరగడం లేదు. నీరు సరఫరా కావడం లేదు.
పీపీఈ కిట్ల కొరత..
రిమ్స్‌లో విధులు నిర్వహించే వారికి పీపీఈ కిట్లు, మాస్కులు, చేతిగ్లౌజుల పంపిణీ సరిగా జరగకపోవడం వల్ల వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు ఐసోలేషన్ వార్డుకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఫలితంగా వ్యాధిగ్రస్థులకు సరైన వైద్యం అందడం లేదు. ఇటీవల ఓ ఏఎస్‌ఐతో పాటు లారీ డ్రైవర్, ఓ మహిళ వైరస్‌తో మృతి చెందినప్పటికీ.. అధికార యంత్రాంగంలో మార్పు కనిపించడంలేదు.
ప్రాణ సంకటంగా మారిన వైరం..
రిమ్స్ డైరెక్టర్ డా.బలరాంకు, ఇతర వైద్యుల మధ్య ఉన్న వ్యవస్థాగతమైన వైరం.. కొవిడ్ బాధితులకు ప్రాణసంకటంగా మారుతోంది. ఉన్నతాధికారులు స్పందిస్తే తప్ప.. సమస్య పరిష్కారమయ్యేలా లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులు నిర్ణయించిన వైద్యశాఖ