ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గుట్కా వ్యాపారం యథేచ్ఛ గా సాగుతోంది. కర్ణాటక నుంచి నేరుగా ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల మధ్య సాగే గుట్కా దందాలో... వారానికి కనీసం రూ. 8 కోట్ల అక్రమ వ్యాపారం జరుగుతోంది. అంబర్‌ను డార్లింగ్ పేరిట, గుట్కాలను స్వీటీ పేరుతో దందా నిర్వహిస్తున్నారు. కంటైనర్ లారీలో సగటున రూ.25 లక్షల విలువ చేసే 200 బస్తాల నిషేధిత గుట్కా బస్తాలను తరలిస్తున్నారు. వీటిని రెండింతలు ఎక్కువగా రేటుకు అంటే రూ.75 లక్షలకు అమ్ముతున్నారు. పోలీసుల కన్నుగప్పి.. రాత్రి సమయంలో ప్రత్యేకంగా మనుషుల్ని నియమించి.. కోడ్ భాషలో తతంగం నడిపిస్తున్నారు.
కంటైనర్‌ను తనిఖీ చేయగా..
లాక్‌డౌన్‌లో భాగంగా ఇటీవల నిర్మల్ జిల్లాలో కంటైనర్‌ను పోలీసులు తనిఖీ చేయగా రూ. 5,25,000 నిషేధిత గుట్కా వ్యవహారం బయటపడింది. ఆదిలాబాద్ సమీపంలో గతంలో ఓసారి చెప్పుల లోడుతో వెళ్తున్న లారీని తనిఖీ చేయగా... గుట్కా వెలుగుచూసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, రామగుండం, గోదావరిఖని కేంద్రాలుగా దందా సాగుతోంది. ఆదిలాబాద్ సమీపంలోని ఓ మండల కేంద్రంలో ఒకరిద్దరు గుట్కా వ్యాపారులను ఓ పోలీసు అధికారి మందలించడం... వివాదానికి దారితీసింది. హైదరాబాద్ కేంద్రంగా సాగే వ్యవహారంపై దృష్టి సారించాడని ఆ వ్యాపారులు పోలీసులనే ఎదురు ప్రశ్నించడంతో... ఆ వ్యవహారం బయటకు పొక్కలేదు.
గుట్కా మాఫియాలో కీలక వ్యక్తులు..
క్షేత్రస్థాయిలో పోలీసులకు సవాలుగా మారిన ఈ వ్యవహారానికి... కొంతమంది నేతల మద్దతు లభిస్తుండడంతో మాఫియాగా మారుతోంది. ఉన్నతాధికారుల దృష్టిసారించి చిన్న చిన్న పాన్ దుకాణాలను కాకుండా... గుట్కా మాఫియాలో కీలక వ్యక్తులపై చర్యతీసుకుంటే తప్ప ఈ అక్రమాలు ఆగే పరిస్థితి కనిపించలేదు.
ఇవీ చూడండి: లక్ష్మీపురంలో విషాదం.. కుటుంబాన్ని మింగేసిన చెరువు