WIPRO Buyback news : ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో రూ.12 వేల కోట్లు విలువైన షేర్లను బైబ్యాక్ చేయడానికి సన్నద్ధమైంది. ఒక్కో ఈక్విటీ షేర్ ధర రూ.445 చొప్పున నిర్ణయించి, మొత్తంగా 26.96 కోట్ల ఈక్విటీ షేర్లు వెనక్కు తీసుకోవడానికి షేర్ల హోల్డర్ల ఆమోదం పొందింది.
స్క్రూటినైజర్ రిపోర్ట్ ప్రకారం, పోస్టల్ బ్యాలెట్, ఈ-ఓటింగ్ ద్వారా 99.9 శాతం మంది షేర్ హోల్డర్లు విప్రో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు ఆమోదం తెలిపారు. 1 జూన్, 2023న జరిగిన ప్రత్యేక రిజల్యూషన్‌లో విప్రోలోని మెజారిటీ వాటాదారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
4.91 శాతం విప్రో షేర్ల బైబ్యాక్
Wipro buyback share price : విప్రో బోర్డు మొత్తంగా 26,96,62,921 ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేయనుంది. ఇది మొత్తం కంపెనీ షేర్లలో 4.91 శాతం అని సంస్థ స్పష్టం చేసింది. దీని విలువ సుమారు రూ.12 వేల కోట్లు ఉంటుందని అంచనా వేసింది. ఒక్కో షేరును రూ.445లకు కంపెనీ కొనుగోలు చేయనుంది. ముఖ్యంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూపులు ఈ బైబ్యాక్‌కు తమ సమ్మతిని తెలిపారు.
ఐటీ దిగ్గజాలు టాటా కన్సల్టన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ సంస్థలకు ధీటుగా విప్రో గత త్రైమాసికంలో రూ.3,074.5 కోట్ల నికర ఆదాయాన్ని సంపాదించింది. మొత్తంగా చూసుకుంటే 2023 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.11,350 కోట్లు మేర నికర ఆదాయాన్ని సమకూర్చుకుంది. అయితే ఇది గతేడాదితో పోలిస్తే 7.1 శాతం తక్కువ. కానీ రెవెన్యూ మాత్రం రూ.90,487.6 కోట్లు. ఇది గతేడాది కంటే 14.4 శాతం అధికం.
NCDలు జారీ ద్వారా రూ.3000 కోట్లు సమీకరిస్తాం: SBI Card
SBI Card NSD issue : వ్యాపార వృద్ధి నిధుల కోసం నాన్ కన్వర్టబుల్ డిబెంటర్లు (NCDs) జారీ చేయడం ద్వారా రూ.3000 కోట్లు సమీకరించనున్నట్లు ఎస్బీఐ కార్డ్ స్పష్టం చేసింది. ఎన్సీడీలు జారీ చేసి రూ.3000 కోట్ల మేర నిధులు సమీకరించడానికి బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారని ఎస్బీఐ కార్డ్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఒక నిర్ధిష్ట వ్యవధిలో ఒకటి లేదా పలు విడతల్లో ప్రైవేట్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఈ నిధులు సమీకరిస్తామని ఈ ప్రభుత్వ రంగ సంస్థ స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: