Term Life Insurance : జీవిత బీమా పాలసీ.. భవిష్యత్‌పై ముందు చూపున్న ప్రతి ఒక్కరికి దీని గురించి బాగా తెలుసు. అలాంటి వారు మాత్రమే వీటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఎన్ని ఎక్కువ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటే అంత ఆర్థిక భద్రత లభిస్తుందని నమ్మేవారు లేకపోలేరు. మరి మనిషి జీవితంలో ఊహించని విధంగా ఆర్థిక భద్రతను కల్పించే ఇటువంటి అంశాలపైన ఎప్పుడైనా మీరు దృష్టి పెట్టారా..? అది కూడా మన చదువు పూర్తయి.. కొత్త ఉద్యోగంలో చేరి తొలి జీతం అందుకున్న దాంట్లో నుంచి కొంత డబ్బుతో ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం చెల్లిస్తే.. ఎంత గొప్ప ఆలోచనో కదూ.
దీని గురించి చదివితేనే మన ఆర్థిక క్రమశిక్షణ ఏ విధంగా ఉందో అనే దానిపై ఇప్పటికే మనకు ఓ అవగాహన వచ్చి ఉండాలి. మన నెల జీతంలో నుంచి కొద్ది మొత్తాన్ని బీమా ప్రీమియం చెల్లింపుల కోసం ఖర్చు చేస్తే.. మీకు తెలియకుండానే ఇవి భవిష్యత్తులో ఆర్థికంగా మిమ్మల్ని మీరు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే కాకుండా మీపై ఆధారపడిన వారికి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నిరంతర ప్రక్రియను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక బాధ్యతగా భావించి.. అలవాటుగా మార్చుకోవాలి. సంపాదించే ప్రతిఒక్కరికీ జీవిత బీమా పాలసీలు తీసుకోవడం అనేది ఎంతో ముఖ్యం. అందుకే మీరు తొలి జీతం అందుకున్న వెంటనే మీరు చేయాల్సిన మొట్టమొదట పని ఏంటంటే.. జీవిత బీమా పాలసీని తీసుకోవడం.
ఆలోచన వచ్చిందా.. వెంటనే అమలు చేసేయండి!
Term Insurance Plan : ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడానికి కొందరు ముఖ్యంగా యువత అతిగా ఆలోచిస్తుంటారు. ఇప్పుడు ఇవి మనకు అవసరమా.. కొన్నేళ్ల తర్వాత తీసుకుందాం అంటూ వాయిదాలు వేస్తుంటారు. ఈ జాప్యమే ఏ మాత్రం మంచిది కాదని అంటుంటారు ఆర్థిక నిపుణులు. ప్రీమియంలు కట్టే మంచి అలవాటు చేసుకోవడానికి గొప్ప ముహుర్తాలు అంటూ ఏమీ ఉండవు. పాలసీ తీసుకోవాలన్న ఆలోచన మీలో కలిగిందా.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దాన్ని ఆచరణలో పెట్టేయండి. ఇవి మీరు భవిష్యత్‌లో వ్యక్తిగతంగా ఎదుర్కోబోయే ఆర్థిక ఇబ్బందుల నుంచి మిమ్మల్ని బయట పడే విధంగా చేస్తాయి. మీరు ఊహించని రీతిలో ఆర్థికంగా దెబ్బతిన్న సందర్భాల్లో ఈ పాలసీలే మీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. పొదుపు, పెట్టుబడులు వంటి ఆర్థిక అంశాలను ఎంత తొందరగా ప్రారంభిస్తే అంత త్వరగా ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు. తొలి జీతంతో టర్మ్ పాలసీ తీసుకుంటే.. ఎక్కువ కాలం బీమా రక్షణ పరిధిలో ఉంటారు.
చిన్న వయసులోనే మొదలుపెట్టండి!
Term Insurance Premium : 'టర్మ్ పాలసీ'లను చిన్న వయసులోనే తీసుకోవడం వల్ల మినిమమ్ ప్రీమియంతో, గణనీయమైన జీవిత బీమా రక్షణ దక్కుతుంది. చిన్న వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది గనుక రిస్కు కూడా తక్కువే. అందుకే, బీమా సంస్థలు తక్కువ ప్రీమియాన్ని వసూలు చేస్తాయి. ఫలితంగా పాలసీ కొనసాగుతున్నన్ని రోజులూ అదే ప్రీమియం ఉంటుంది. దీర్ఘకాలంలో ఇది మీకు ఎంతో విలువను జోడిస్తుంది. ఇతర ఆర్థిక వ్యవహారాలను సులభంగా సాధించేందుకు ఈ పాలసీలో ఎంతగానో ఉపయోగపడతాయి.
ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు!
Term Insurance Tax Benefit : ఆదాయాన్ని ఆర్జించడం మొదలు పెట్టిన వెంటనే ఆదాయపు పన్ను ప్రణాళికలను వేసుకోవాల్సిన అవసరమూ ఏర్పడుతుంది. ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందేందుకు జీవిత బీమా పాలసీలనూ ఉపయోగించుకోవచ్చు. ఫలితంగా మన ఆదాయంపై చెల్లించాల్సిన పన్ను కూడా తగ్గుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్-1961, సెక్షన్ 80సీ కింద ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తే.. రూ.1,50,000 వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. కాకపోతే పాత పన్ను విధానం ఎంచుకున్నప్పుడే ఇది వర్తిస్తుందని గుర్తుంచుకోండి.
అన్నీ తెలుసుకుని తీసుకోండి!
Term Insurance vs Life Insurance : టర్మ్ పాలసీలను ఒక బలవంతపు కొనుగోలుగా భావించకండి. వాటిని మీ ఇష్టపూర్వకంగా తీసుకోవాలి. ఆర్థిక లక్ష్యాల సాధనలో భాగంగా ఎప్పటికైనా ఒక పాలసీని తీసుకోవాల్సిందే. పెరిగే ఆదాయం, బాధ్యతలకు అనుగుణంగా పాలసీ మొత్తాన్ని కూడా పెంచుకుంటూ వెళ్లండి. చివరగా మార్కెట్లో అనేక రకాల జీవిత బీమా పాలసీలను ఇన్సూరెన్స్ కంపెనీలు వినియోగదారులకు అందిస్తున్నాయి. వీటన్నింటి వివరాలను క్లుప్తంగా ఏజెంట్ల ద్వారా అడిగి తెలుసుకొని బేరీజు వేసుకొండి. ఆ తర్వాతే మీ స్తోమతకు తగ్గ పాలసీలను ఎంచుకోండి.