Vehicle RC Transfer Process : ప్రతి వాహనానికీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) తప్పనిసరి. అందుకే వాహనం కొనుగోలు చేసిన తర్వాత సంబంధిత ప్రాంత రవాణా అధికారి కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ధ్రువపత్రమే ఆ వాహనం మనదని చెప్పడానికి రుజువు. ఈ పత్రంలో మీ వాహనానికి సంబంధించిన అన్ని వివరాలుంటాయి. ముఖ్యంగా దీనిలో మీ వాహన రిజిస్ట్రేషన్ తేదీ, నంబరు, మోడల్, ఇంజిన్ నంబరు తదితర వివరాలు ఉంటాయి.
కొందరు సొంత రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో వాహనాలు కొనుగోలు చేస్తారు. మరికొందరు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత కారణాల రీత్యా వెళుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కచ్చితంగా మీ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)ను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కూడా మీ ఆర్సీని మరో ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారా ? అయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆర్సీని ఎలా బదిలీ చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలి:
NOC For RC Transfer : మీ వాహనం ఆర్సీని మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటే మొదట చేయాల్సిన పని.. 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) పొందడం. మీ వాహనం ప్రస్తుతం రిజిస్టర్ చేసి ఉన్న ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) నుంచి ఈ 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) పొందాల్సి ఉంటుంది. NOC తీసుకునేటప్పుడు దానిలో కచ్చితంగా మీ బండి ఛాసిస్ నంబర్ ఉండేలా చూసుకోవాలి.
2. స్థానిక ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాలి!
మీరు NOCని పొందిన తర్వాత.. మీరు వెళ్లిన కొత్త రాష్ట్రం లేదా ప్రాంతంలోని RTO కార్యాలయానికి వెళ్లండి. ముఖ్యంగా మీ బండి ఆర్సీ బదిలీ ప్రక్రియ కోసం అవసరమైన అన్ని పత్రాలను తీసుకువెళ్లండి.
3. పత్రాల సమర్పణ
ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి సంబంధించిన ధ్రువ పత్రాలను అధికారికి సమర్పించండి. వాటిని సమర్పించే ముందు.. బదిలీ ప్రక్రియలో సమస్యలు నివారించడానికి ప్రతి దాన్నీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ బదిలీ ప్రక్రియ సులభంగా పూర్తి అవుతుంది.
4. రోడ్ టాక్స్ కట్టాలి!
Vehicle Road Tax : ఆయా ప్రాంతాలు, రాష్ట్రాల్లో రహదారి పన్ను చలాన్లు వేర్వేరుగా ఉంటాయి. కనుక, మీరు వాహనం రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నప్పుడు, దాన్ని బదిలీ చేయాలనుకున్నప్పుడు.. కచ్చితంగా కొత్త చలాన్ కట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ ప్రాంతంలోని ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి.. 'రహదారి పన్ను చలాన్' కట్టండి. అలాగే మీ వాహన రిజిస్ట్రేషన్‌ను ధ్రువీకరించడానికి అవసరమైన ఇతర పన్నులు, రుసుములను కూడా చెల్లించండి.
5. వెహికల్ వెరిఫికేషన్
Vehicle Verification : చలాన్ కట్టిన అనంతరం.. స్థానిక ఆర్టీవో అధికారి సమక్షంలో మీ వాహన తనిఖీ ప్రక్రియ జరుగుతుంది. ఈ తనిఖీ చేసే సమయంలో వాహనానికి కావాల్సిన అన్ని పరీక్షలు చేస్తారు. ముఖ్యంగా ధ్రువీకరణ కోసం బండి ఛాసిస్ నంబర్‌ను తీసుకుంటారు.
6. సరికొత్త RC పొందండి
పైన పేర్కొన్న అన్ని పనులు పూర్తిచేసిన తర్వాత, ఆర్టీవో కార్యాలయం.. మీకు ఎప్పుడు కొత్త ఆర్సీ లభిస్తుందో తెలియజేస్తుంది. ఆ తేదీన వెళ్లి మీరు సులువుగా ఆన్లైన్లోనే మీ సరికొత్త ఆర్సీని డౌన్లోడ్ చేసుకోండి. లేదా నేరుగా ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి ఆర్సీని తీసుకోండి. ఈ విధంగా మీ బండి ఆర్సీ బదిలీ ప్రక్రియను సులువుగా పూర్తి చేసుకోండి.