Upcoming Hero Bikes in India 2023 : భారత్ లాంటి ఎదుగుతున్న దేశాల్లో కార్ల కంటే కూడా ఎక్కువగా బైకులు, స్కూటర్లు లాంటి ద్విచక్ర వాహనాలను వాడుతుంటారు. ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు, విద్యార్థులు కళాశాలలకు వెళ్లేందుకు ఎక్కువగా వీటి మీదే ఆధారపడతారు. మధ్య తరగతి జనాభా అధికంగా ఉండే మన దేశంలో కార్లు కొనే సత్తా ఉన్నవారు చాలా తక్కువ. అత్యధికులు ద్విచక్ర వాహనాలను వాడుతుంటారు. కాబట్టి ప్రపంచంలోని దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు భారత్ మీద దృష్టి సారిస్తున్నాయి. ఇంత పెద్ద మార్కెట్‌ను ఎవరు వదులుకుంటారు చెప్పండి! ఇదిలా ఉంటే.. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హీరో మోటో కార్ప్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారైన హీరో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రికార్డు స్థాయిలో నూతన ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి తీసుకురానుంది హీరో సంస్థ. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు సరికొత్త మోడళ్లను వినియోగదారులకు పరిచయం చేయాలని చూస్తోంది. తొలుత ఎక్స్‌పల్స్ 200 4వీ రివైజ్డ్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ఎక్స్ పల్స్ 200 4వీ రివైజ్డ్ వెర్షన్ బైక్‌కు సంబంధించి ఆసక్తికర అప్డేట్స్ బయటకు వచ్చాయి. హీరో నుంచి రానున్న నూతన మోడళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ 2023 మోడల్..
Hero Xpulse 200 4V 2023 : ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఇప్పుడు అడ్వెంచర్ వెహికిల్స్‌కు డిమాండ్ బాగా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని హీరో తీసుకొచ్చిన ఎక్స్ పల్స్ మోడల్ బాగా విజయవంతం అయింది. ఈ బైక్‌ను కొనేందుకు యువత ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో ఎక్స్పల్స్లో మరిన్ని మార్పులుచేర్పులు చేసి 2023-అప్డేటెడ్ వెర్షన్‌ను తీసుకొస్తోంది హీరో సంస్థ. కొత్త మోడల్లో డ్యుయల్ ఛానల్ ఏబీఎస్ సిస్టమ్ తో పాటు ర్యాలీ, రోడ్, ఆఫ్ రోడ్ లాంటి డ్రైవింగ్ మోడ్ ఫీచర్లను కూడా అందిస్తోంది. రైడర్లకు మరింత విజిబిలిటీ కోసం కొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్ ఈడీ డే లైట్ రన్నింగ్ లైట్లను కూడా హీరో జత చేసింది. అలాగే వైడ్స్క్రీన్ను సైజును పెంచింది, కొత్త స్విచ్ గేర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఫీచర్లను మినహాయిస్తే పాత మోడల్లో వేరే మార్పులేమీ చేయలేదు.
2. ఎక్స్ట్రీమ్ 160ఆర్ 2023 మోడల్..
Hero Xtreme 160R 2023 : హీరో బైక్స్‌లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న మోడల్స్‌లో ఎక్స్ట్రీమ్ 160ఆర్ ఒకటి. ఈ బైక్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా కస్టమర్లు కోరిన పలు మార్పులుచేర్పులను చేసి అప్డేటెడ్ వెర్షన్‌ను తీసకొస్తోంది హీరో. ఇందులో అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ ఫీచర్ జత చేసినట్లు తెలుస్తోంది. అలాగే కొత్త పెయింట్ స్కీమ్స్‌తో వీటిని మార్కెట్లోకి తీసుకొస్తున్నారట. కొత్త మోడల్లో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌ను కూడా మార్చారట. మరో ఒకట్రెండు నెలల్లో 160ఆర్‌ను లాంఛ్ చేస్తారని సమాచారం. ఇందులో డ్యుయల్ ఛానల్ ఏబీఎస్ సిస్టమ్ ఫీచర్ కూడా ఉందట. ఈ అధునాతన ఫీచర్ల వల్ల బైక్‌కు మరింత డిమాండ్ ఉంటుందని.. తద్వారా మార్కెట్ లో దూసుకుపోతున్న బజాజ్ పల్సర్ ఎన్160కి ఇది గట్టి పోటీనివ్వొచ్చని హీరో భావిస్తోంది.
3. హీరో ప్యాషన్ ప్లస్..
Hero Passion Plus 2023 : మన దేశంలోని మధ్య తరగతి ప్రజలు ఎంతగానో ఆదరించిన బైక్ హీరో ప్యాషన్ ప్లస్. కొన్నేళ్ల పాటు భారత మార్కెట్లో ఈ బైక్ మంచి ఆదరణ సంపాందించింది. అందుకే ఈ బైక్‌ను రీలాంఛ్ చేస్తోంది హీరో సంస్థ. కొత్త మోడల్లో కలర్ స్కీమ్స్, లుక్స్ అన్నీ ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. 97.2 సీసీ, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో రానున్న కొత్త ప్యాషన్ ప్లస్.. 7.91 బీహెచ్పీ పవర్ ఔట్పుట్, 8.05 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. గతంలో ఎన్నో సంచనాలు సృష్టించిన ప్యాషన్ ప్లస్.. రీలాంఛ్ అయ్యాక ఇంకెన్ని ప్రకంపనలు రేపుతుందో చూడాలి.
4. హీరో ఎక్స్ట్రీమ్ 200ఎస్ 4వీ..
Hero Xtreme 200S 4V : ఎక్స్ట్రీమ్ 200టీకి వస్తున్న ఆదరణ దృష్ట్యా దీనికి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది హీరో సంస్థ. 200టీకి ఉండే 199.6 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ 4వీ ఇంజిన్ సామర్థ్యాన్ని పెంచి.. 200ఎస్‌గా బయటకు తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ బైక్‌ను డీలర్లకు చూపించింది హీరో. 200ఎస్‌ను 18.83 బీహెచ్పీ పవర్, 17.3 ఎన్ఎం టార్క్‌తో అభివృద్ధి చేసింది.
5. హీరో కరిజ్మా ఎక్స్ ఎంఆర్ 210..
Hero Karizma XMR 210 : హీరో సంస్థ ప్రవేశపెట్టిన బైక్స్‌లో బాగా పాపులర్ అయిన మరో మోడల్ కరిజ్మా. సినిమాల్లో కూడా ఈ బైక్‌ను ఎక్కువగా వాడేవారు. దీంతో అప్పట్లో యువతకు ఇది కలల వాహనంగా మారింది. అయితే ఆ తర్వాత ఇది కనుమరుగైంది. మొత్తానికి తిరిగి ఎంట్రీ ఇవ్వనుంది కరిజ్మా. ఈ ఏడాది ఆఖరుకు లేదా వచ్చే ఏడాది ప్రథమార్థంలో కరిజ్మా ఎక్స్ ఎంఆర్ 210 బైక్ మార్కెట్లోకి రానుంది. దీన్ని సూపర్ స్పోర్ట్ బైక్‌గా హీరో రూపొందిస్తోంది.
కేటీఎం ఆర్ సీ 200, యమహా ఆర్ 15 వీ3, సుజుకీ ఎస్ ఎఫ్ 250, బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 లకు పోటీగా కరిజ్మా ఎక్స్ ఎంఆర్ 210ను తీసుకొస్తోంది హీరో. పాత కరిజ్మా డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయకుండానే ఎక్స్ ఎంఆర్ 210ను తయారు చేశారు. అయితే ఫీచర్లు, అధునాతన సాంకేతికతను మాత్రం జత చేశారు. ఈ బైక్ కోసం సరికొత్త 210 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసింది హీరో సంస్థ.