ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. చాలా బ్యాంకులు గరిష్ఠంగా 6.50 -7.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుండగా.. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 8-9% వరకు కూడా వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది వీటిలో పెట్టుబడిపెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఇతర పెట్టుబడి పథకాలతో పోల్చి చూస్తే బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లను అర్థం చేసుకోవడం సులభమే. అయినప్పటికీ, ప్రస్తుతం వివిధ రకాల ఎఫ్డీలను బ్యాంకులు అందిస్తున్నాయి. వాటి గురించి పూర్తిగా తెలుసుకుని తగిన ఎఫ్‌డీను ఎంచుకోవడం ముఖ్యం.
ఫిక్స్డ్ డిపాజిట్ల రకాలు
స్టాండర్డ్ ఎఫ్డీ..
దాదాపు భారతీయ బ్యాంకులన్నీ స్టాండర్డ్ ఎఫ్‌డీను అందిస్తున్నాయి. ముందుగా నిర్ణయించిన కాలపరిమితి కోసం డబ్బు డిపాజిట్ చేయాలి. 7 రోజుల నుంచి మొదలుకొని 10 సంవత్సరాల వరకు వివిధ కాలపరిమితులతో ఎఫ్డీలు అందుబాటులో ఉంటాయి. ఎంచుకున్న కాలపరిమితిని బట్టి బ్యాంకు ముందే వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. సాధారణ పొదుపు ఖాతాతో పోలిస్తే స్టాండర్డ్ ఎఫ్డీ వడ్డీ రేటు ఎక్కువగానే ఉంటుంది. కాలపరిమితి కంటే ముందుగానే ఎఫ్డీ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుంటే.. పెనాల్టీ వర్తిస్తుంది. ఈ ఎఫ్డీపై రుణం, ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం అందుబాటులో ఉంటాయి.
పన్ను-ఆదా ఎఫ్డీ..
ఇది స్టాండర్డ్ ఎఫ్డీకి భిన్నంగా ఉంటుంది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితికి డిపాజిట్ చేయడం సాధ్యం కాదు. ఈ ఎఫ్డీలకు ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి ప్రీమెచ్యూర్ విత్‌డ్రాలను, రుణాలను అనుమతించరు. పెట్టుబడులపై సెక్షన్ 80C కింద ఏడాదికి రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే వడ్డీపై మాత్రం పన్ను వర్తిస్తుంది. ఈ ఎఫ్డీలో ఏకమొత్తంగా మాత్రమే డిపాజిట్ చేయాలి.
స్పెషల్ ఎఫ్డీ..
ఇవి నిర్దిష్ట కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందువల్ల వీటిని స్పెషల్ ఎఫ్‌డీలుగా పిలుస్తారు. 290, 390, 666 రోజుల కాలపరిమితో బ్యాంకులు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వీటిని ఆఫర్ చేస్తుంటాయి. వీటిపై సాధారణంగా స్టాండర్డ్ ఎఫ్డీలపై వర్తించే వడ్డీ రేటు కంటే ఎక్కువ వడ్డీరేటు లభిస్తుంది. బ్యాంకులు విధించిన నిర్దిష్ట కాలం పాటు ఎఫ్డీ కొనసాగించాలి. మధ్యలో బ్రేక్ చేసేందుకు వీలుండదు.
క్యూములేటివ్ ఎఫ్డీలు..
ఈ రకమైన ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టిన మొత్తంపై వచ్చిన వడ్డీని కాంపౌండింగ్ చేస్తారు. కాబట్టి ఈ ఎఫ్డీ.. మీ పెట్టుబడి మొత్తాన్ని పెంచుకునేందుకు సాయపడుతుంది. వడ్డీ మొత్తాన్ని మెచ్యూరిటీ సమయంలో చెల్లిస్తారు. సాధారణంగా ఎఫ్‌డీల్లో త్రైమాసిక కాంపౌండింగ్ ఉంటుంది.
నాన్-కుమ్యులేటివ్ ఎఫ్డీ..
ఈ ఎఫ్‌డీల్లో అసలు డిపాజిట్ మొత్తం అలాగే ఉంటుంది. వడ్డీని మాత్రం మీరు ఎంచుకున్న కాలవ్యవధి ప్రకారం (వార్షికం, అర్ధ వార్షికం, త్రైమాసికం, నెలవారీగా) చెల్లిస్తారు. ఇది క్రమమైన ఆదాయం కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. అయితే, మీరు వడ్డీ ముందస్తుగా తీసుకుంటున్నట్లయితే చక్ర వడ్డీ ప్రయోజనాన్ని కోల్పోతారని గుర్తుంచుకోవాలి.
సీనియర్ సిటిజన్ ఎఫ్డీ..
సాధారణ డిపాజిట్‌దారుల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఉంటుంది. బ్యాంకును బట్టి 0.25% నుంచి 0.75% వరకు కూడా అదనపు వడ్డీ లభిస్తుంది. మిగిలిన అంశాలు సాధారణ డిపాజిట్లలాగానే ఉంటాయి.
ఫ్లెక్సీ ఎఫ్డీ..
మీకు నచ్చిన మొత్తంతో ఎఫ్డీ ఖాతాను ప్రారంభించవచ్చు. ఆపై ఈ ఖాతాను మీ పొదుపు ఖాతాకు అనుసంధానించవచ్చు. పొదుపు ఖాతాలో మీరు విధించిన పరిమితి కంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేస్తే.. ఆ మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాకు జమవుతుంది. అలాగే, మీరు కావాల్సినప్పుడు ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ఖాతాలో లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. పొదుపు ఖాతా కంటే ఎక్కువగానే వడ్డీ రేటు ఉంటుంది.
కార్పొరేట్ ఎఫ్డీ..
ఎన్బీఎఫ్సీలు, ప్రైవేట్ సంస్థల వద్ద చేసిన ఎఫ్డీలను కార్పొరేట్ ఎఫ్డీలు అంటారు. బ్యాంకులతో పోలిస్తే కార్పొరేట్ ఎఫ్డీలు అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంటాయి. కానీ, కొంత రిస్క్ ఉంటుంది. కాబట్టి 'ఏఏఏ' రేటింగ్ ఉన్న ఎఫ్డీలను ఎంచుకోవడం మంచిది.
చివరిగా..
పెట్టుబడులకు భద్రత ఉండడంతో పాటు రాబడికి హామీ ఉండడంతో ఎక్కువ మంది ఫిక్స్డ్ డిపాజిట్లను ఇష్టపడతారు. అయితే, ఎఫ్‌డీల్లో కూడా కొంత నష్టభయం ఉండొచ్చు. అందువల్ల డీఐసీజీసీ కింద వచ్చే బ్యాంకులను ఎంచుకోవడం మంచిది. అలాగే, ఎఫ్డీ చేసే ముందు వడ్డీ రేటుతో పాటు, ప్రీమెచ్యూర్ విత్‌డ్రా పెనాల్టీలు, ఇతర ప్రయోజనాలను తెలుసుకోవాలి.