Twitter Fake Accounts: పది ట్విట్టర్ అకౌంట్లలో ఎనిమిది నకిలీవే అన్న టాప్ మోస్ట్ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు డాన్ వుడ్స్ వాదనను ఉటంకిస్తూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి ట్విట్టర్‌పై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ గతంలో చెప్పినట్లు నకిలీ ఖాతాల సంఖ్య 5శాతం కాదని కచ్చితంగా అంతకంటే ఎక్కువేనని ఎద్దేవా చేశారు మస్క్.
యూఎస్ ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్‌లతో 20 సంవత్సరాలకు పైగా పనిచేసిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఎఫ్-5 గ్లోబల్ హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డాన్ వుడ్స్ 80 శాతానికి పైగా ట్విట్టర్ ఖాతాలు నకిలీవి కావచ్చని ది ఆస్ట్రేలియన్ పత్రికతో అన్నారు. అలాగే ట్విట్టర్ యజమాన్యం, ఎలాన్ మస్క్ ఇద్దరూ ఈ సమస్యను తక్కువ అంచనా వేసినట్లు చెప్పారు.
ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.3.50 లక్షల కోట్లు) కొనుగోలు చేసేందుకు ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని జులైలో రద్దు చేసుకున్నారు మస్క్. నకిలీ ఖాతాల సంఖ్యకు సంబంధించి తాను అడిగిన సమాచారాన్ని ఇవ్వడంలో ట్విట్టర్ విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ కోర్టును ఆశ్రయించింది. ఎలాన్ మస్క్ షరతులకు లోబడి ఒప్పందాన్ని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డెలావర్‌లోని ఓ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఒప్పందంలో అంగీకరించినట్లుగా ఒక్కో షేరును 54.20 డాలర్ల వద్ద కొనుగోలు చేసేలా ఆదేశించాలని కోరింది.
ఈ పిటిషన్‌ను స్వీకరించిన డెలావర్ కోర్టు.. అక్టోబరు 17 నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు దీనిపై విచారణ జరపనున్నట్లు వెల్లడించింది. దీంతో మస్క్.. సామాజిక మాధ్యమంపై కౌంటర్ దావా వేశారు. అయితే ఈ దావాపై ట్విట్టర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఇవీ చదవండి: సీరం నుంచి మరో కీలక వ్యాక్సిన్.. అతి తక్కువ ఖర్చుతో ప్రాణాంతక వ్యాధికి చెక్!
మళ్లీ రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. రూ.1.43 లక్షల కోట్లు రాబడి