Money Saving tips : ప్రతి సంవత్సరం డబ్బు నిర్వహణకు సంబంధించిన ఆర్థిక ప్రణాళికలు రచించుకోవడం.. వాటిని చేరుకోవడంలో విఫలమవడం.. చాలామంది విషయంలో జరిగేదే! తద్వారా డబ్బు వృథా అవడంతో పాటు వెనక్కి తిరిగి చూసుకుంటే.. అనుకున్న పని ఒక్కటీ పూర్తి కాదు. మరి, ఇలాంటి అలసత్వానికి చెక్ పెట్టాలంటే.. కొన్ని నియమాలు పాటించాలంటున్నారు నిపుణులు. తద్వారా ఏడాదంతా ఆర్థిక స్థిరత్వం సాధించడంతో పాటు డబ్బుతో ముడిపడి ఉన్న పనులన్నీ సవ్యంగా పూర్తయ్యే అవకాశాలూ ఉన్నాయంటున్నారు. మరి, ఇంతకీ ఏంటా నియమాలు? తెలుసుకుందాం రండి..
ఛాలెంజ్.. డబ్బు పొదుపు చేసే విషయంలో ‘వచ్చే నెల నుంచి మొదలుపెడతా!’ అనే నియమం పెట్టుకుంటారు కొందరు. ఇక నెలలు గడిచినా దాన్ని ఆచరణలో పెట్టరు. అయితే ఈ వాయిదాను వాయిదా వేయాలంటే.. కొత్త ఏడాదిలో ‘మనీ సేవింగ్ ఛాలెంజ్’ తీసుకోమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీకొచ్చే ఆదాయంలో ఖర్చులు పోను.. దేనికెంత డబ్బు పక్కన పెట్టాలనుకుంటున్నారో ముందుగా ఓ ప్రణాళిక వేసుకోవాల్సి ఉంటుంది. అంటే.. నెలవారీ ఖర్చుల కోసం మినహాయించి.. మిగతా డబ్బులో అత్యవసర నిధి, ప్రయాణ నిధి, ఇంకా ఇంటికి కావాల్సిన వస్తువులేవైనా కొనాలనుకుంటే వాటి కోసం.. ఇలా విడివిడిగా కొంత మొత్తంలో డబ్బులు దాచుకోవడం మొదలుపెట్టాలి. తద్వారా ఒక దాని కోసం దాచిన డబ్బును మరొకదానికి వినియోగించాల్సిన అవసరం రాదు. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.
కర్త, కర్మ, క్రియ.. అన్నీ మీరే.. ‘ఆడవాళ్లకు డబ్బు నిర్వహణ తెలియదు.. ఎంత డబ్బు సంపాదిస్తున్నా.. దాని పొదుపు-మదుపుల దగ్గరికొచ్చేసరికి మాత్రం ఇంట్లో ఉండే మగాళ్ల పైనే ఆధారపడతారు..’ అనుకుంటారు చాలామంది. అయితే ఎంతోమంది మహిళలు ఆర్థిక విషయాల్లో అవగాహన పెంచుకొని సమాజంలో ఉన్న ఈ ధోరణిని క్రమంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు.. కోట్లు పెట్టుబడి పెట్టి సొంతంగా వ్యాపారాలు చేస్తున్నారు.. లాభాలూ ఆర్జిస్తున్నారు. ఈ కొత్త ఏడాదిలో మీరూ వాళ్ల జాబితాలో చేరచ్చు. ఈ క్రమంలో పెట్టుబడులు, పొదుపు-మదుపులు, నష్టపోకుండా డబ్బును పొదుపు చేసే ఇతర మార్గాలేంటి?.. ఇలా ఆర్థికంగా ప్రతి విషయంలో అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో అవసరమైతే నమ్మకస్తులైన నిపుణుల సహాయం తీసుకోండి. అయితే ఇలా కొత్తగా తెలుసుకునే క్రమంలో ఒక్కోసారి కొంత డబ్బు నష్టపోయినా బాధపడద్దు.. ఎందుకంటే దానివల్ల మనకు బోలెడన్ని విషయాలు తెలుస్తాయి. ఇలా ఇకపై మీ డబ్బు నిర్వహణ బాధ్యతలన్నీ మీరే చూసుకోవడం వల్ల మరికొంతమందిలో స్ఫూర్తి నింపచ్చు.
కలలకు జీవం పోయండి.. కొత్త సంవత్సరంలో ఇల్లు కట్టుకోవాలి, ఫ్లాట్ తీసుకోవాలి, ఇంటి స్థలం కొనుక్కోవాలి, కొత్త వ్యాపారం ప్రారంభించాలి.. ఇలా ఎంతోమందికి ఎన్నెన్నో కలలు, ఆశయాలు. కానీ అవి నెరవేరేది కొంతమంది విషయంలోనే అని చెప్పచ్చు. మరి, ఈ క్రమంలో చాలామంది విఫలమవడానికి సరైన ప్రణాళికలు వేసుకోకపోవడమే ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. కాబట్టి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కావాలంటే.. ఆదాయంలో నుంచి కొంత డబ్బు వెనకేసుకోవడమే ముందున్న మార్గమంటున్నారు.
సైడ్ బిజినెస్.. సో బెటర్.. వచ్చే జీతం సరిపోక ఆ ఏడాదంతా ఆర్థిక కష్టాలు ఎదుర్కొనే వారూ లేకపోలేదు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే.. అదనపు ఆదాయ మార్గం వెతుక్కోవడం మేలంటున్నారు నిపుణులు. అంటే.. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయమని దాని ఉద్దేశం కాదు.. వారాంతాల్లో లేదా సమయం దొరికినప్పుడు మీలోని సృజనకు పదును పెట్టి.. విభిన్న వస్తువులు తయారుచేయచ్చు. మీకు ఫ్యాషన్ డిజైనింగ్ వచ్చుంటే.. ఖాళీ సమయాల్లో ఆయా దుస్తుల్ని డిజైన్ చేయడంపై దృష్టి సారించచ్చు. మీలో ఉన్న సృజనను, వివిధ రకాల నైపుణ్యాలను వీడియోల రూపంలో రూపొందించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయచ్చు.. ఇలా ఆలోచించాలే కానీ అదనపు ఆదాయ మార్గాలకు కొదవే లేదు.
కొనే విషయంలో స్మార్ట్‌గా.. దుస్తులు, చెప్పులు, ఇతర యాక్సెసరీస్.. ఇలాంటి విషయాల్లో చాలామంది అమ్మాయిలు అస్సలు రాజీ పడరు. కావాలంటే ఒక జత ఎక్కువే కొని పెట్టుకుంటారు.. కానీ అస్సలు అడ్జస్ట్ అవ్వరు. అయితే ఇలా అదనంగా కొనే వస్తువుల విషయంలో కాస్త ఆలోచించాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే అది మీకు నిజంగానే అవసరమా? లేదంటే ఇతరుల్ని చూసి మీరు కావాలనుకుంటున్నారా? అనేది ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. అలాగే మీరు కొనాలనుకున్న వస్తువులు కూడా ఏదైనా ‘డిస్కౌంట్ ఆఫర్స్’, ‘క్యాష్ బ్యాక్’, ‘కూపన్ కోడ్స్’.. వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్న షాపింగ్ వెబ్‌సైట్స్ నుంచి కొనుగోలు చేయడం ఉత్తమం. ఇక ఆఫ్‌లైన్‌లో కొనాలనుకున్న వారు.. పండగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో ఆయా షాపుల్లో పెట్టిన ‘డిస్కౌంట్ సేల్స్' వినియోగించుకుంటే డబ్బూ ఆదా అవుతుంది.. కావాలనుకున్న వస్తువులూ మన సొంతమవుతాయి.