తమ సంస్థలోని 10శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ పునరుద్ఘాటించారు. రానున్న మూడు నెలల్లో ఈ 10శాతం ఉద్యోగుల తొలగింపు జరుగుతుందని ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ అధినేత స్పష్టం చేశారు. ఉద్యోగాల కోతతో సంస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3.5 శాతం తగ్గుతుందని బ్లూమ్‌బర్గ్ నిర్వహించిన ఖతార్ ఎకనామిక్ ఫోరమ్‌లో మస్క్ వెల్లడించారు.
టెస్లా నుంచి పది శాతం మంది ఉద్యోగులను తొలగించేందుకు మస్క్ కొద్దిరోజులుగా సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నియామకాలను నిలిపివేస్తున్నట్లు టెస్లా ఎగ్జిక్యూటివ్‌లకు పంపిన ఇ-మెయిల్‌లో మస్క్ ఇప్పటికే పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా లేదని, కంపెనీ ఉద్యోగులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నట్లు తెలిపారు. ఈ వార్తల నేపథ్యంలోనే టెస్లా షేర్లు దాదాపు 9 శాతం క్షీణించాయి. ప్రపంచవ్యాప్తంగా టెస్లాకు దాదాపు 10,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఆఫీసుకు రావాలంటూ కొద్దిరోజుల క్రితమే టెస్లా ఉద్యోగులకు ఎలాన్ మస్క్ లేఖలో అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. వర్క్ ఫ్రమ్ హోంకు స్వస్తి చెప్పి అందరూ ఆఫీసుకు రావాల్సిందేనని ఆదేశించారు. వారంలో కనీసం 40 గంటలైనా ఆఫీసు నుంచి పనిచేయాలన్నారు. అలా చేయని వారంతా ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా పరిగణిస్తామని హెచ్చరించారు. ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మస్క్ ఈ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి: ట్విట్టర్ 'డీల్'ను ఆమోదించాలని వాటాదార్లను కోరిన బోర్డు
'ఆమె'గా మారిన ఎలాన్ మస్క్ కుమారుడు.. పేరు మార్చుకునేందుకు కోర్టుకు