Tesla India Launch: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. భారత్‌లో అడుగు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దిగుమతి సుంకాలపై నెలకొన్న ప్రతిష్టంభన వీడకపోవడం వల్ల భారత్‌లో టెస్లా కార్ల విక్రయించే ప్రణాళికకు విరామం ఇవ్వనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. టెస్లా కార్ల విక్రయంపై ఏడాదిగా భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ సఫలం కాలేకపోయింది. దీంతో షోరూంలు, సర్వీస్ సెంటర్ల కోసం స్థలాల అన్వేషణ ప్రయత్నాలను విరమించుకున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా కార్ల తయారీని భారత్‌లోనే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం వల్ల అందుకు సిద్ధంగా లేని టెస్లా.. ప్రస్తుతానికి ఆ ప్రయత్నాలకు దూరంగా ఉండేందుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీని అమెరికా, చైనా దేశాల్లో ఉత్పత్తి చేస్తోంది. వీటిని భారత్‌లో దిగుమతి చేసి విక్రయించేందుకు గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే, తొలుత విదేశాల్లో తయారైన కార్లను మాత్రమే భారత్‌లో విక్రయిస్తామని, ఆ తర్వాతే తయారీ యూనిట్‌ను స్థానికంగా నెలకొల్పుతామని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ చెబుతూ వచ్చారు. దీంతోపాటు ఎలక్ట్రిక్ కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని కోరుతున్నారు. అయితే, మేక్-ఇన్-ఇండియాకు ప్రాధాన్యత ఇస్తోన్న భారత ప్రభుత్వం మాత్రం ఎలాన్ మస్క్ ప్రతిపాదనలకు అంగీకరించలేదు. ఎలక్ట్రిక్ కార్ల తయారీని భారత్‌లోనే చేపట్టాలని పలుమార్లు స్పష్టం చేయడం వల్ల షోరూంలు, సర్వీస్ సెంటర్లకోసం ఆయా నగరాల్లో చేసిన ప్రయత్నాలను టెస్లా విరమించుకుంది.
మస్క్ ట్వీట్‌పై దుమారం: వాస్తవానికి 2019లోనే టెస్లాను భారత విపణిలోకి తీసుకురావాలని ఎలాన్ మస్క్ భావించారు. అయితే భారత్‌లో విద్యుత్ వాహనాల (ఈవీ) దిగుమతిపై 100శాతం సుంకం ఉందని, దీన్ని తగ్గించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదే సమయంలో ఇక్కడి ప్రభుత్వ నిబంధనలు, కొన్ని సవాళ్ల కారణంగానే టెస్లా రాక ఆలస్యమవుతోందని ఇటీవల సోషల్ మీడియాలో ఎలాన్ మస్క్ ట్వీట్ చేయడం తీవ్ర దుమారానికి దారితీసింది. మస్క్ ఆరోపణలను ఖండించిన భారత ప్రభుత్వం.. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టింది. ఇలా భారత్‌లో టెస్లా కార్ల విక్రయాలకు మస్క్ చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడం వల్ల.. తాత్కాలికంగా ఈ ప్రయత్నాలను విరమించుకునేందుకే మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది.
ఇదీ చదవండి: మరో బాంబు పేల్చిన మస్క్- ట్విట్టర్ డీల్‌కు బ్రేక్!