Tata motors price hike 2022: వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 1.5 నుంచి 2.5 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. జులై 1 నుంచి పెంచిన ధరలు అమలవుతాయని పేర్కొంది. మోడల్, వేరియంట్‌ను బట్టి ఎంత పెంచాలనే నిర్ణయం తీసుకుంటామని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
"వివిధ తయారీ దశలలో వ్యయాన్ని తగ్గించేందుకు సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటోంది. అయితే, ఇన్పుట్ వ్యయాలు భారీగా పెరుగుతున్నాయి. అందువల్ల ధరలు పెంచడం అనివార్యం అవుతోంది" అని వివరించింది.
గత ఏప్రిల్‌లో ఓసారి వాహనాల ధరలను పెంచింది టాటా మోటార్స్. ప్యాసింజర్ వాహనాల ధరలను 1.1 శాతం, వాణిజ్య వాహనాల ధరలను 2 నుంచి 2.5 శాతం పెంచింది.
చిన్నకార్లకు బైబై!
మరోవైపు, చిన్నకార్ల తయారీ భారంగా మారితే వాటిని నిలిపివేసేందుకు వెనకాడబోమని మారుతి సుజుకీ ఛైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం భారత్ ఎన్సీఏపీ విధానం తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. "ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన వల్ల కార్ల ధరలు ఇంకా పెరుగుతాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు తగ్గేందుకు కూడా ఉపకరించకపోవచ్చు. ఎంట్రీ లెవెల్ కార్ల ద్వారా సంస్థకు పెద్దగా లాభాలు ఉండవు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల వ్యాపారం చేయడం కష్టమైతే చిన్నకార్ల తయారీని నిలిపివేసేందుకు సంస్థ వెనకాడదు. ప్రస్తుతం ఉన్న చాలా కార్లు.. మార్కెట్ ప్రయోజనాలను కోల్పోతాయి. తొలిసారి కారు కొనేవారికి ధరలు ఆకర్షణీయంగా అనిపించవు" అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
కార్ల తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ భారత్ ఎన్సీఏపీ పేరుతో ముసాయిదా నోటిఫికేషన్‌ను కేంద్రం రూపొందించింది. దీనికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే ఆమోదముద్ర వేశారు. దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా 1.5 లక్షల మంది మరణిస్తున్న నేపథ్యంలో.. కొత్త కార్లకు కఠినమైన టెస్ట్ నిర్వహించాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఎనిమిది మంది ప్రయాణించగలిగే కార్లలో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు గడ్కరీ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: