Stock market today India : అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తప్పదన్న విశ్లేషణల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ దాదాపు 1093 పాయింట్లు పతనమై 58వేల 841 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 347 పాయింట్లు తగ్గి 17వేల 531 వద్దకు చేరింది. ఆటో, ఐటీ, లోహ, ఉత్పాదక వస్తువులు, విద్యుత్, స్థిరాస్తి రంగాలు షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. వేర్వేరు దేశాల కేంద్ర బ్యాంకులు వరుసగా వడ్డీ రేట్లు పెంచడం 2023లో ఆర్థిక మాంద్యానికి కారణం కావచ్చని ప్రపంచ బ్యాంకు హెచ్చరించడం.. శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఈస్థాయిలో నష్టపోయేందుకు కారణమైంది.
ప్రపంచ బ్యాంకు ఏమంది?
వడ్డీరేట్ల పెంపు కారణంగా 2023లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తలెత్తే అవకాశం ఉందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. పెరుగుతున్న ధరలను కట్టడి చేయడానికి గత ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో ఏకకాలంలో పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. రేట్ల పెంపుతో రుణాలను మరింత ఖరీదైన వ్యవహారంగా మార్చి ధరలను తగ్గించాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ, ఇదే సమయంలో ఆర్థిక వృద్ధి మందగించే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. త్వరలో అమెరికా ఫెడరల్ రిజర్వు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(బీవోఈ) పరపతి విధాన సమీక్షలు జరగనున్న సమయంలో ఈ హెచ్చరికలు వెలువడటం గమనార్హం. ఫెడ్, బీవోఈలు ఈ సారి కూడా వడ్డీరేట్లను పెంచవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.
1970 తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ స్థాయిలో కుంగడం ఇదే తొలిసారని వరల్డ్‌బ్యాంక్ పేర్కొంది. అమెరికా, చైనా, ఐరోపా ఆర్థిక వ్యవస్థలు బాగా మందగించాయని నివేదికలో వెల్లడించింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఓ మోస్తరు ఎదురు దెబ్బ తగిలినా.. ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటుందని విశ్లేషించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించింది. అంతేకాదు.. తమ నిర్ణయాలను స్పష్టంగా మిగిలిన వాటితో పంచుకొని ఆర్థిక వ్యవస్థపై అనవసర ఒత్తిడి తగ్గించాలని పేర్కొంది. 2008లో లేమన్ బ్రదర్స్ పతనం తర్వాత అమెరికా ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్ కేంద్ర బ్యాంకులు సంయుక్తంగా వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే.