Stock Market All Time High Close : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఆల్‌టైమ్ రికార్డుస్థాయికి చేరాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 529 పాయింట్లు లాభపడి.. 66,589 పాయింట్ల జీవితకాల గరిష్ఠస్థాయి వద్ద ముగిసింది. అలాగే జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 147 పాయింట్లు ఎగబాకి.. 19,711 వద్ద స్థిరపడింది.
Stock Market Closed Today : సోమవారం ఉదయం 66,190 వద్ద ప్రారంభమైన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. కాసేపటికే లాభాల బాట పట్టింది. ఆ తర్వాత మరింత జోరును చూపించింది. చివరకు 529 పాయింట్లు లాభపడి.. 66,589 వద్ద స్థిరపడింది. అలాగే జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ కూడా 19,612 వద్ద ప్రారంభమై.. చివరకు 147 పాయింట్ల లాభంతో 19,711 వద్ద ట్రేడింగ్ ముగిసింది.
భారీగా ఆ కంపెనీల షేర్లు కొనుగోళ్లు..
బ్యాంకింగ్, ఆయిల్ కంపెనీల షేర్ల కొనుగోళ్లతో సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డును నమోదు చేశాయి. విదేశీ నిధుల వెల్లువ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు జీవితకాల గరిష్ఠ స్థాయిలలో ముగిశాయి. చైనా జీడీపీ డేటా తక్కువగా ఉండటం వల్ల ఆసియా స్టాక్ మార్కెట్‌లో మిశ్రమ ఫలితాలు కనిపించాయి. దీంతో భారత షేర్ మార్కెట్లు ఎన్నడూ లేని గరిష్ఠ స్థాయిలో ముగిసిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మరోవైపు ఆసియా మార్కెట్లలో సియోల్, షాంఘై నష్టాలతో ముగిశాయి.
లాభాలతో ముగిసిన షేర్లు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్, విప్రో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలతో ముగిశాయి.
ఈ కంపెనీలకు నష్టాలు..
హీరో మోటోకార్ప్, ఓఎన్‌జీసీ, భారతి ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ, టైటాన్ సంస్థల షేర్లు నష్టాలతో ముగిశాయి.
రూపాయి విలువ!
Rupee Open : అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి మారకపు విలువ డాలర్‌తో పోల్చితే 12 పైసలు పెరిగి రూ.82.05 వద్ద కొనసాగుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.