Stock Market Closing: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ సూచీలు బుధవారం లాభాలు గడించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 574 పాయింట్లు పెరిగి 57 వేల 38 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 178 పాయింట్ల లాభంతో 17 వేల 137 వద్ద సెషన్‌ను ముగించింది.
- దేశీయ సూచీలు రోజంతా సానుకూలంగానే కదలాడాయి. తొలుత దాదాపు 280 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ ఓ దశలో దాదాపు 750 పాయింట్లకుపైగా పెరిగి 57 వేల 217 వద్ద సెషన్ గరిష్ఠాన్ని తాకింది. 56 వేల 521 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది.
- ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, టీసీఎస్, రిలయన్స్ వంటి హెవీవెయిట్ షేర్లలో కొనుగోళ్లతో మార్కెట్లు దూసుకెళ్లాయి.
- గత 5 సెషన్లలో నష్టాలు, ముఖ్యంగా సోమ, మంగళవారాల్లో భారీ నష్టాల నేపథ్యంలో.. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.
- మరోవైపు.. ఉక్రెయిన్- రష్యా యుద్ధ పరిస్థితులు, ద్రవ్యోల్బణ భయాలతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
- మంగళవారం సెషన్లో అమెరికా సూచీలు కూడా సానుకూలంగానే ట్రేడయ్యాయి. ఇదీ దేశీయ సూచీలు పుంజుకోవడానికి ఓ కారణంగా వ్యాపార నిపుణులు చెబుతున్నారు. బుధవారం కూడా దాదాపు అన్ని ఆసియా, ఐరోపా స్టాక్ సూచీలు లాభాలు నమోదుచేశాయి.
- బీపీసీఎల్, టాటా మోటార్స్, శ్రీ సిమెంట్స్, ఐచర్ మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్ రాణించాయి. సెన్సెక్స్ 30 ప్యాక్‌లో దాదాపు 20కిపైగా షేర్లు లాభాల్లో ముగిశాయి. బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ డీలాపడ్డాయి.
- ఆటో, ఫార్మా, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు ఒక శాతం మేర లాభపడ్డాయి.
- లోహం, బ్యాంకింగ్ రంగాల షేర్లలో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు.
- బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడయ్యాయి.
- క్రితం సెషన్లో సెన్సెక్స్ 704, నిఫ్టీ 215 పాయింట్ల మేర పడిపోయాయి.
ఇవీ చూడండి: 'ఉచిత పథకాలతో ఆర్థిక విధ్వంసం.. వ్యవస్థల స్థిరత్వానికి పెను ప్రమాదం'
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెరిగిన బిట్‌కాయిన్ విలువ