Stock Market Close: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుస నష్టాలు నమోదుచేస్తున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 233 పాయింట్లు కోల్పోయి.. 57 వేల 362 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 70 పాయింట్లు తగ్గి 17 వేల 153 వద్ద సెషన్‌ను ముగించింది. ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు కుదేలయ్యాయి. రియాల్టీ రంగం ఒక శాతం మేర పెరిగింది. ఆసియా మార్కెట్లలో బలహీన సంకేతాలతో.. దేశీయ సూచీలు ప్రతికూలంగానే ట్రేడయ్యాయి. హెవీవెయిట్ షేర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీలో నష్టాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపాయి.
సెన్సెక్స్ తొలుత దాదాపు 200 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. అనంతరం తీవ్ర ఒడుదొడుకులతో నష్టాల్లోకి జారుకుంది. ఓ దశలో దాదాపు 500 పాయింట్లు కోల్పోయి.. 57 వేల 100 వద్ద కనిష్ఠాన్ని నమోదుచేసింది. 57 వేల 845 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఆసియా మార్కెట్లలో టోక్యో, సియోల్, హాంకాంగ్, షాంఘై సూచీలు కూడా నష్టాల్లోనే కదలాడాయి. అమెరికా మార్కెట్లు మాత్రం గత సెషన్లో మంచి లాభాలను నమోదుచేశాయి. గురువారం సెషన్లో భారత స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 89, నిఫ్టీ 23 పాయింట్ల మేర పడిపోయాయి.
లాభనష్టాల్లో ఇవే: బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ రాణించాయి. టైటాన్ కంపెనీ, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ, సిప్లా, నెస్లే ఇండియా నష్టపోయాయి. మొత్తంగా 1256 షేర్లు లాభపడ్డాయి. 1958 షేర్లు పతనమయ్యాయి. 91 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
ఇవీ చూడండి: మీ పేరుతో ఎవరో అప్పు చేస్తే.. ఏం చేయాలి?