Starbucks CEO Laxman : ప్రముఖ కాఫీ గొలుసుకట్టు వ్యాపార సంస్థ స్టార్‌బక్స్‌కు సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ నియమితులయ్యారు. నరసింహన్.. కంపెనీకి సీఈఓగానే కాకుండా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడిగానూ ఉంటారని స్టార్‌బక్స్ గురువారం ప్రకటించింది. అక్టోబరు 1న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది.
55 ఏళ్ల నరసింహన్ బ్రిటన్‌కు చెందిన రెకిట్ బెంకిజర్ అనే బహుళజాతి కంపెనీకి సీఈఓగా పనిచేశారు. సెప్టెంబరు 30న రెకిట్ బెంకిజర్ కంపెనీ సీఈఓ బాధ్యతల నుంచి లక్ష్మణ్ నరసింహన్ వైదొలిగినట్లు సంస్థ తెలిపింది. 'అమెరికాకు తిరిగి రావడానికి నాకు అవకాశం లభించింది. లండన్‌ను విడిచిపెట్టి రావడం కష్టతరమైనప్పటికీ.. కుటుంబం కోసం కఠిన నిర్ణయం తీసుకుంటున్నా' అని లక్ష్మణ్ నరసింహన్ తెలిపారు.
అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ స్టార్‌బక్స్‌కు లక్ష్మణ్ నరసింహన్ సీఈఓగా నియమితులవ్వడం వల్ల భారత సంతతికి చెందిన మరో వ్యక్తి ఉన్నత శిఖరాన్ని అధిరోహించనట్లైంది. ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓగా శంతను నారాయణ్, గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్, ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ తదితరులు భారత సంతతికి చెందిన వ్యక్తులు సీఈఓలుగా ఉన్నారు.
ఇవీ చదవండి: ట్విట్టర్లో 80 శాతం నకిలీ ఖాతాలే.. మస్క్ కీలక వ్యాఖ్యలు
ఆ ఫోన్ కాల్స్, మెసేజెస్ నమ్మితే అంతే సంగతులు.. కష్టార్జితం అంతా స్వాహా!