SBI Quarterly Results Q2 2023 : భారతదేశంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ.. మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.16,099.58 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.14,752 కోట్ల నికర లాభంతో పోలిస్తే 9.13 శాతం వృద్ధిని నమోదు చేసింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.18,356 కోట్లతో పోలిస్తే లాభం స్వల్పంగా తగ్గింది.
SBI Standalone Net Profit : స్టాండలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.13,264.52 కోట్ల నుంచి రూ.14,330.02 కోట్లకు పెరిగింది. దేశంలో ఐదో వంతు మార్కెట్ వాటాను కలిగి ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. మొత్తం ఆదాయం సైతం సమీక్షా త్రైమాసికంలో రూ.88,733 కోట్ల నుంచి రూ.1.12 లక్షల కోట్లకు పెరిగింది. క్యాపిటల్ అడిక్వసీ 14.28 శాతంగా ఉంది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి ఎస్‌బీఐ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం లాభంతో రూ.578.15 వద్ద ముగిశాయి.
నిరర్థక ఆస్తులు (NPA)
SBI Non performing Assets (NPA) : ఎస్‌బీఐ స్థూల నిరర్థక ఆస్తులు (Gross-NPA) సెప్టెంబర్ చివరి నాటికి 2.55 శాతానికి పడిపోయాయి. తొలి త్రైమాసికంలో ఎన్‌పీఏలు 2.76 శాతంగా ఉన్నాయి. గతేడాది ఇదే కాలంలో ఎస్‌బీఐ ఎన్‌పీఏలు 3.52 శాతంగా ఉన్నాయి. అదే విధంగా నికర ఎన్‌పీఏలు కూడా 2023 సెప్టెంబర్‌లో 0.64 శాతానికి తగ్గాయి.
వడ్డీ ఆదాయం పెరిగింది!
SBI Net Interest Income (NII) : ఈ ఏడాది ఎస్బీఐకు వడ్డీ ఆదాయం గతేడాదితో పోలిస్తే 12.3 శాతం పెరిగి రూ.39,500 కోట్లకు చేరింది. దీంతోపాటు ఇతర ఆదాయ వనరులలో 21.6% వృద్ధి చెంది, రూ.10,790 కోట్లకు చేరుకుంది.
అంతేకాకుండా ఎస్‌బీఐ మొత్తం బ్యాంకు డిపాజిట్లలో కూడా వృద్ధి నమోదైంది. గతేడాదితో పోలిస్తే డిపాజిట్లు 11.91 శాతం పెరిగాయి. సెప్టెంబర్ 30 వరకు CASA నిష్పత్తి (CASA డిపాజిట్ అనేది బ్యాంక్ కస్టమర్ల కరెంట్, సేవింగ్స్ ఖాతాలలో జమ అయ్యే మొత్తం. ఇది బ్యాంకులకు చౌకైన, ప్రధాన నిధుల వనరు) 41.88 శాతంగా ఉంది.
Reliance SBI Card : సూపర్ ఆఫర్లతో రిలయన్స్- SBI క్రెడిట్ కార్డు.. ఎన్ని రివార్డ్‌లో తెలుసా?