Russian Key Interest Rates Hike : రష్యన్ సెంట్రల్ బ్యాంక్ మంగళవారం 3.5 శాతం మేర కీలక వడ్డీ రేట్లు పెంచింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి కట్టడి చేసేందుకు, అలాగే రూబుల్ పతనాన్ని అడ్డుకునేందుకు ఈ చర్యలు చేపట్టింది.
ఉక్రెయిన్‌తో యుద్ధం!
Russia vs Ukraine War : ఉక్రెయిన్ యుద్ధం దీర్ఘకాలంగా కొనసాగుతున్న నేపథ్యంలో.. రష్యా కరెన్సీ రూబుల్ విలువ దారణంగా పడిపోయింది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం భారీగా పెరగడం, యుద్ధం ఖర్చులు విపరీతంగా పెరుగుతుండడం, పశ్చిమ దేశాలు రష్యా ముడి చమురు, సహజ వాయువు ఎగుమతులపై కఠినమైన ఆంక్షలు విధించడం వల్ల.. రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. ముఖ్యంగా ఎగుమతులు తగ్గి, దిగుమతులు పెరుగుతుండడం వల్ల రష్యాపై ఆర్థిక భారం తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు రష్యా కేంద్ర బ్యాంకు తాజా చర్యలు చేపట్టింది.
వడ్డీ రేట్లు భారీగా పెంచే ప్రయత్నం!
Russian Interest Rates Hike : సోమవారం జరిగిన సెంట్రల్ బ్యాంక్ బోర్డు మీటింగ్‌లో కీలక వడ్డీ రేట్లను 12 శాతం మేర పెంచాలని నిర్ణయించారు. రూబుల్ మరింత పతనం కాకుండా నియంత్రించేందుకు ఈ చర్య చేపట్టాల్సి వచ్చింది. వాస్తవానికి ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో.. పశ్చిమ దేశాలు రష్యా ముడిచమురు ఎగుమతులపై ఆంక్షలు విధించాయి. దీనితో రష్యాకు ఎగుమతులపై వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయింది. మరో వైపు యుద్ధ ఖర్చులు రోజురోజుకూ బాగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే రూబుల్ భారీగా పతనమైంది.
రూబుల్ పతనం ఆగేనా!
Russian Ruble Decline : సోమవారం రష్యా కరెన్సీ రూబుల్ విలువ.. అమెరికన్ డాలర్‌తో పోల్చితే 101 రూబుల్స్‌గా ఉంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రూబుల్ తన విలువలో మూడింట ఒక వంతును కోల్పోయింది. ఇది గత 17 నెలల్లో అత్యంత కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం.
సెంట్రల్ బ్యాంకుపై నెపం నెట్టేశారు!
అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆర్థిక సలహాదారుడైన మాక్సిమ్ ఒరేష్కిన్.. రష్యన్ సెంట్రల్ బ్యాంకుపై తన అసహనాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా రష్యన్ కేంద్ర బ్యాంకు ఆర్థిక విధానం సరిగ్గా లేదని ఆయన విమర్శించారు. రూబుల్ పతనాన్ని నిలువరించేందుకు అవసరమైన అన్ని సాధనాలు రష్యన్ కేంద్ర బ్యాంకు వద్ద ఉన్నాయని అన్నారు. త్వరలోనే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం కూడా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.