రిలయన్స్ జియో నుంచి సరికొత్త డివైజ్-నిమిషాల్లో మీ పాత కారు మరింత స్మార్ట్! - జియోమోటివ్ ప్రయోజనాలు
Reliance Launches JioMotive Device : మీ పాత కారును స్మార్ట్‌గా మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. రిలయన్స్ జియో సరికొత్త డివైజ్‌ను లాంచ్ చేసింది. ధర కూడా చాలా తక్కువ. ఈ డివైజ్‌తో మీ కారును నిమిషాల్లో స్మార్ట్‌గా మార్చుకోవచ్చు. అది ఎలాగో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.!
Published : Nov 7, 2023, 1:42 PM IST
Reliance Launches JioMotive Device : ప్రస్తుత టెక్ యుగంలో ఆటో మొబైల్ రంగంలో వచ్చే ప్రతిదీ అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లో అందుబాటులోకి వస్తోంది. ఈ క్రమంలో కొత్త కారు కొనుగోలు చేయకుండానే మీ దగ్గర ఉన్న నార్మల్ కారును స్మార్ట్ కారుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారా? ఉన్న కారులోనే మోడ్రన్ కారు లాంటి బెనిఫిట్స్ పొందాలనుకుంటున్నారా? అయితే అలాంటి వారికి ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో(Reliance Jio) గుడ్ న్యూస్ చెప్పింది.
దేశ మార్కెట్లోకి 'జియోమోటివ్'(JioMotive) పేరుతో రిలయన్స్ జియో ఓ సరికొత్త డివైజ్‌ను లాంచ్ చేసింది. ఇది మీ కారులోని సమస్యలను ఇట్టే పట్టేయడంతో పాటు నిమిషాల్లో మీ కారును స్మార్ట్‌గా మార్చుతుంది. ఇంతకీ ఈ డివైజ్ ధర ఎంత? దీనిని ఎలా ఉపయోగించాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Reliance Jio Launched JioMotive Smart Car OBD : పాకెట్ సైజ్‌లో కేవలం రూ.4,999కే రిలయన్స్ జియో తీసుకొచ్చిన జియోమోటివ్(JioMotive) అనేది ప్లగ్ అండ్ ప్లే 'ఓబీడీ' (On-Board Diagnostics) గ్యాడ్జెట్. ఏ కారునైనా నిమిషాల్లో స్మార్ట్ వాహనంగా మార్చగలిగే ఈ పరికరం.. రియల్ టైమ్ పర్ఫార్మెన్స్‌తో పాటు కారులోని సమస్యలను కూడా ముందుగానే తెలియజేస్తుంది. దాంతో వినియోగదారుడు వాటిని ఈజీగా పరిష్కరించుకోవడం ద్వారా కారు మెయింటెనెన్స్ పెంచుకోవచ్చు. ఈ డివైజ్‌ను ఎలాంటి క్లిష్టమైన రీ-వైరింగ్ లేకుండానే మీ కారులో ఉపయోగించవచ్చు. ఈ డివైజ్ రిలయన్స్ డిజిటల్, జియో.కామ్, అమెజాన్(Amazon) వంటి ఈ కామర్స్ సైట్లలో అందుబాటులో ఉంటుంది.
మాములు కారు స్మార్ట్ కారుగా ఎలా మారుతుందంటే.. జియోమోటివ్‌ను కారు ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్ (OBD) పోర్ట్‌లోకి ప్లగ్ ఇన్ చేయాలి. సాధారణంగా OBD డాష్‌బోర్డ్ కింద ఉంటుంది. ఈ సరికొత్త డివైజ్ e-SIMతో ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవుతుంది. యూజర్ ఇప్పటికే కలిగి ఉన్న జియో నంబర్ డేటా ప్లాన్‌ను ఈ e-SIM షేర్ చేసుకుంటుంది. ఈ యూజర్ డివైజ్ కోసం మీరు ప్రత్యేక SIM కార్డ్ లేదా డేటా ప్లాన్‌ను కొనుగోలు చేయనవసరం లేదనే విషయం గుర్తుంచుకోవాలి.
How to use JioMotive Device in Cars :
ఈ స్మార్ట్ డివైజ్‌ను ఎలా యూజ్ చేయాలంటే..
- మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి జియోథింగ్స్ (JioThings) యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మీ జియో నంబర్‌తో జియోథింగ్స్‌కు లాగిన్ లేదా సైన్ అప్ చేయాలి. అనంతరం “+“పై క్లిక్ చేసి జియోమోటివ్‌ను ఎంచుకోవాలి.
- అప్పుడు జియోమోటివ్ బాక్స్ లేదా డివైజ్‌పై ఉన్న IMEI నంబర్‌ను నమోదు చేసి 'కంటిన్యూ' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీ కారు రిజిస్ట్రేషన్ నంబర్, కారు పేరు(బ్రాండ్ నేమ్), మోడల్, ఫ్యూయల్ టైప్ వంటి కారు వివరాలను నమోదు చేసి సేవ్ ఆప్షన్‌పై నొక్కాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ జియోమోటివ్ డివైజ్‌ను ఓబీడీ పోర్ట్‌కి ప్లగ్ చేసి.. తరువాత దశలను కంప్లీట్ చేయాలి.
- ఇక చివరగా JioEverywhereConnect నెంబర్ షేరింగ్ ప్లాన్ రూల్స్ అంగీకరిస్తున్నట్లు టిక్ చేసి, ఎనేబుల్ మీద క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత JioJCR1440 మీద క్లిక్ చేసి ప్రొసీడ్ అవ్వగానే మీకు జియో నుంచి యాక్టివేట్ అభ్యర్థనకు ఓకే అనే మెసేజ్ వస్తుంది. ఇది యాక్టివేట్ కావడానికి కారును 10 నిముషాలు ఆన్‌లోనే ఉంచాలి.
JioMotive Features in Telugu :
లోకేషన్ ట్రాకింగ్ : కారు తమ వద్ద లేనప్పుడు కూడా ఈ డివైజ్‌ను ఉపయోగించి యూజర్ కారు రియల్ టైమ్ లొకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు. అలాగే కారు నడిపిన లొకేషన్ హిస్టరీని కూడా చూడవచ్చు. ఇది దొంగతనాలకు కచ్చితంగా చెక్ పెడుతుంది.
జియో-ఫెన్సింగ్ : ఈ JioMotiveతో వినియోగదారులు మ్యాప్‌లో వర్చువల్ సరిహద్దులను సెట్ చేసుకోవచ్చు. అలాగే మీ కారు ఈ జోన్‌లలోకి ఎంటర్ లేదా ఎగ్జిట్ అయినప్పుడు అలర్ట్స్ వస్తాయి. మీకు డ్రైవింగ్ సమయంలో ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.
డ్రైవింగ్ అనలిటిక్స్ : ఈ డివైజ్‌ను ఉపయోగించి డ్రైవింగ్ హ్యాబిట్స్, బిహేవియర్‌పై అవగాహన పొందవచ్చు. అలాగే స్పీడ్, యాక్సిలరేషన్, బ్రేకింగ్, కార్నరింగ్, ఫ్యూయల్ ఎఫీషియెన్సీ వంటి మెట్రిక్స్ చూడవచ్చు. అదే విధంగా డ్రైవింగ్ స్కిల్స్ ఎలా మెరుగుపరుచుకోవాలి, ఫ్యూయల్ ఎలా ఆదా చేయాలి అనే దానిపై టిప్స్, సజెషన్స్ కూడా దీని ద్వారా పొందవచ్చు.
రిమోట్ డయాగ్నస్టిక్స్ : JioMotive పరికరం కారు పనితీరును పర్యవేక్షిస్తూ హెచ్చరికలను సమయానికి ముందే అందిస్తుంది. ఇది కారు నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి, కారు జీవితకాలాన్ని పొడిగించడానికి సహాయపడుతుంది.