డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 80 స్థాయికి క్షీణించిన నేపథ్యంలో, పతనాన్ని నిలువరించేందుకు విదేశీ మారకపు నిల్వల్లో కొంతమేర వినియోగిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. 'వర్షాలు పడే సమయంలో మీరు గొడుగు కొంటారు కదా'.. అదేవిధంగా కరెన్సీ ఊగిసలాటలను అదుపులో ఉంచడానికి, విదేశీ మారక నిల్వలను వినియోగిస్తామని పేర్కొన్నారు. ఇతర వర్థమాన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి బలంగానే ఉందని దాస్ వివరించారు.
'రూపాయి భారీ ఊగిసలాటను ఆర్‌బీఐ చూస్తూ ఊరుకోదు. ఆర్‌బీఐ చర్యల వల్లే రూపాయి చలనాలు స్థిరంగా ఉన్నాయ'న్నారు. అయిత రూపాయి విలువ ఇంతమేర ఉంచాలనే లక్ష్యాన్ని ఆర్‌బీఐ విధించుకోలేదని స్పష్టం చేశారు. సరైన విదేశీ ద్రవ్యలభ్యత ఉండడం కోసం మార్కెట్‌కు అమెరికా డాలర్లను ఆర్‌బీఐ సరఫరా చేస్తోందన్నారు. 'అసలు మనం నిల్వలను పోగు చేసేదే ఇటువంటి అవసరాల కోసం కదా' అని పేర్కొన్నారు. '2016 నుంచి ద్రవ్యోల్బణ లక్ష్యం ఆధారిత ప్రణాళికను అందిపుచ్చుకున్నాం. ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల రీత్యా దానిని కొనసాగిస్తామ'ని బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్వహించిన కార్యక్రమంలో ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు.
డిజిటల్ రుణ సంస్థల కార్యకలాపాలపై..
'డిజిటల్ రుణ సంస్థలు తమ కార్యకలాపాలను కేవలం వాటికున్న లైసెన్సుల ప్రకారమే జరపాలి. ఉల్లంఘనలను అనుమతించబోమ’ని దాస్ స్పష్టం చేశారు. 'లైసెన్సులకు భిన్నంగా ఏదైనా చేయాలంటే మా అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా ఏవైనా కార్యకలాపాలు చేస్తే కుదరదు. వినూత్నతకు మద్దతు ఇస్తాం.. కానీ మొత్తం వ్యవస్థ ఒక నియంత్రణ వాతావరణంలో వృద్ధి చెందాలి. ఆర్థిక స్థిరత్వం విషయంలో ఎటువంటి రాజీ ఉండబోద'ని అన్నారు.
మూడేళ్లకే మార్చేయొద్దు.. ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతుల పదవీ విరమణ వయసును 70 ఏళ్లకు పెంచాలని, వారిని మూడేళ్లకే అనుమతించడమూ సరికాదని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మాజీ ఛైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. ప్రైవేటు బ్యాంకుల అధిపతులను 70 ఏళ్ల వయసు వరకు, 15 ఏళ్ల సర్వీసుకు అనుమతిస్తున్న ఆర్‌బీఐ, ప్రభుత్వరంగ బ్యాంకులకు మాత్రం ఈ నిబంధనలో వ్యత్యాసం ఎందుకు చూపుతుందో అర్థం కావడం లేదన్నారు. దీర్ఘకాలం పదవిలో కొనసాగినప్పుడే.. కొన్ని మార్పులు చేసేందుకు అవకాశం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. మూడేళ్లలోనే భారీ మార్పులు సాధ్యం కాదని పేర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అందరికీ ఆర్థిక సేవలను అందించడం, ప్రజలతో మమేకం కావడంలాంటివి ప్రభుత్వరంగ బ్యాంకులకు కీలకమని, పెట్టుబడిదారులు ఆశించే ఆదాయం, ఖర్చుల నిష్పత్తి ఇక్కడ ముఖ్యం కాదని పేర్కొన్నారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, పెద్ద నోట్ల రద్దు వంటి సవాళ్లను మన ప్రభుత్వరంగ బ్యాంకులు ఎదుర్కొన్నంత సమర్థంగా ప్రపంచంలోని ఏ బ్యాంకింగ్ వ్యవస్థా చేపట్టలేదన్నారు.
ఇవీ చదవండి: క్యూ1 ఫలితాల్లో అదరగొట్టిన జియో.. రూ.2.23 లక్షల కోట్ల ఆదాయం!
'ఇక పొడిగించేది లేదు.. అదే డెడ్‌లైన్'.. ఐటీఆర్ గడువుపై కేంద్రం క్లారిటీ