RBI To Reintroduce 1000 Currency Notes : ప్రస్తుతానికి రూ.1000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే ఆలోచన ఏదీ తాము చేయడం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. రూ.1000 నోట్లను మళ్లీ రీఇంట్రడ్యూస్ చేస్తారనే వార్తలు.. పూర్తిగా ఊహాజనితం అని పేర్కొంది.
ఊహాజనితం
కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్న తరువాత.. రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెడతారనే ఊహాగానాలు, వార్తలు వచ్చాయి. అయితే రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసింది. ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ ఊహాజనితమే అని పేర్కొంది.
రూ.500, రూ.1000 డీమోనటైజేషన్
కేంద్ర ప్రభుత్వం 2016 నంబర్లో అకస్మాత్తుగా రూ.500, రూ.1000 నోట్ల చలామణిని రద్దు చేసింది. అంటే డీమోనటైజేషన్ చేసింది. దీని వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ దగ్గర ఉన్న నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల వద్ద తమ భారీగా బారులు తీరారు.
రూ.2000 నోట్ల ఉపసంహరణ
గతంలో ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ రూ.2000 నోట్ల చలామణిని ఉపసంహరించుకున్న తరువాత.. వాటిని మార్చుకోడానికి లేదా డిపాజిట్ చేయడానికి మొదటిగా సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. తరువాత ఈ గడువును మరో వారం పాటు పొడిగించింది. ప్రస్తుతం ఈ గడువు కూడా ముగిసింది. కానీ ఇంకా ఎవరి దగ్గరైనా రూ.2000 నోట్లు ఉంటే.. వాటిని ఆర్బీఐ ఇష్యూ ఆఫీస్ల వద్ద డిపాజిట్ చేసుకునే అవకాశం ఇచ్చింది.
సర్క్యులేషన్లో ఎన్ని ఉన్నాయంటే..
వాస్తవానికి ఆర్బీఐ 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచే రూ.2000 నోట్ల ముద్రణను నిలిపివేసింది. రూ.2000 నోట్ల చలామణిని నిలుపుదల చేసిన తరువాత.. ఇప్పటి వరకు 3.43 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయి. వీటిలో 87 శాతం వరకు బ్యాంకు డిపాజిట్లు ద్వారా, మిగిలిన 9 శాతం నోట్ల మార్పిడి ద్వారా జమ అయ్యాయి. ఇప్పుడు కేవలం రూ.12,000 కోట్లు (3.37%) విలువైన నోట్లు మాత్రమే సర్క్యులేషన్లో ఉన్నాయి.