Post Office Time Deposit Scheme : ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత ఆదా చేయాలని భావిస్తారు. అందుకోసం సురక్షితంగా ఉండే స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. అలాగే తక్కువ రిస్క్‌తో ఎక్కువ లాభాలు వచ్చే పొదుపు పథకాల కోసం కూడా వెతుకుతారు. మరి అలాంటి స్కీమ్ కోసం మీరు వెతుకుతున్నారా? అయితే మీరు పోస్టాఫీస్ అందిస్తోన్న 'పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్'(Post Office Time Deposit Scheme) గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇందులో ఎలాంటి రిస్క్ లేకుండా మీ డబ్బులు రెట్టింపు చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో మీరు పెట్టే డబ్బులపై బ్యాంకులు అందించే దానికన్నా ఎక్కువ వడ్డీ పొందవచ్చు. అయితే దీని కోసం దీర్ఘకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకీ ఈ స్కీమ్‌లో చేరడానికి అర్హతలేంటి? ఎంతకాలం ఇన్వెస్ట్ చేయవచ్చు? వడ్డీరేట్లు ఏవిధంగా ఉన్నాయి? పూర్తి వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Post Office Time Deposit Scheme Eligibility Criteria in Telugu :
ఈ స్కీమ్ అర్హతలు, కనీస డిపాజిట్..
- భారతదేశ నివాసితులైన వ్యక్తులు పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈ ఖాతాను నగదు లేదా చెక్‌తో మొదలుపెట్టవచ్చు. చెక్ ద్వారా అకౌంట్ తెరుస్తుంటే చెక్ చెల్లుబాటు అయిన తేదీని అకౌంట్ ఓపెన్ చేసిన తేదీగా పరిగణిస్తారు.
- ఈ స్కీమ్‌లో కనీసం రూ.1000తో ఖాతాను తెరవాల్సి ఉంటుంది. గరిష్ఠ డిపాజిట్‌పై ఎలాంటి పరిమితులూ లేవు.
- ఉమ్మడిగా కూడా ఈ అకౌంట్‌ను తీసుకోవచ్చు. అయితే, గరిష్ఠంగా ముగ్గురు వ్యక్తులు మాత్రమే జాయింటుగా ఖాతాను తెరిచే వీలుంది.
- మైనర్ల తరఫున తల్లిదండ్రులు లేదా గార్డియన్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. సరిపడ వయసు వచ్చిన తర్వాత మైనర్లు స్వయంగా తమ ఖాతాను నిర్వహించుకోవచ్చు.
- అంతేకాకుండా, ఒక వ్యక్తి తన ఖాతాను ఒక పోస్టాఫీసు బ్రాంచి నుంచి మరొక బ్రాంచికి సులభంగా బదిలీ చేసుకోవచ్చు.
లాక్-ఇన్ పీరియడ్.. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో ఖాతా తెరవడానికి వివిధ కాలపరిమితులతో లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఒకటి, రెండు, మూడు, ఐదు సంవత్సరాల కాలపరిమితులతో డిపాజిట్ చేయవచ్చు. కాల వ్యవధిని పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది. పోస్టాఫీసుకు అధికారికంగా దరఖాస్తు పంపడం ద్వారా ఇది సాధ్యం అవుతుంది.
ఈ స్కీమ్‌లో వడ్డీ రేట్లు ఇలా.. పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో వడ్డీ రేట్లను త్రైమాసిక ప్రాతిపదికన లెక్కిస్తారు. కానీ, వార్షిక ప్రాతిపదికన పెట్టుబడిదారులకు చెల్లిస్తారు. త్రైమాసికానికి ఒకసారి వడ్డీరేట్లను సవరిస్తారు. ప్రస్తుతం పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో ఒక సంవత్సరం పాటు ఇన్వెస్ట్ చేస్తే 6.9 శాతం వడ్డీ, 2 లేదా 3 ఏళ్లు పెట్టుబడి పెడితే 7 శాతం వడ్డీ, 5 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. అయితే, కస్టమర్ పెట్టుబడి రెట్టింపు కావడానికి ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పడుతుందనే విషయం గమనించాలి.
డబ్బు రెట్టింపు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే.. గ్యారెంటీ ఆదాయాన్ని కోరుకునేవారికి పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ మంచి ఎంపిక. ఇందులో ఇన్వెస్టర్ల డబ్బు రెట్టింపు అయ్యే లెక్కను ఓసారి పరిశీలిస్తే.. ఉదాహరణకు మీరు ఐదేళ్లపాటు రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టారనుకోండి. 7.5 శాతం వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ టైమ్‌లో మీకు రూ.7,24,974 వస్తాయి. వడ్డీ రాబడి రూ. 2,24,974గా ఉంది. అంటే ఈ స్కీమ్‌లో మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు 7.5 శాతం ప్రకారం 114 నెలల తర్వాత రెట్టింపు అవుతుంది.
పన్ను మినహాయింపు.. ఈ పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో డిపాజిట్‌దారులు ఆదాయపు పన్నుచట్టం, 1961 సెక్షన్ 80సి కింద రూ.1.50 లక్షల వరకు మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఇది ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉన్న డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తుంది.
ముందుస్తు విత్‌డ్రాలు.. ఈ స్కీమ్‌లో డిపాజిట్లను మెచ్యూరిటీ కంటే ముందే విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే అకౌంట్ తెరిచిన రోజు నుంచి కనీసం 6 నెలల పాటు డిపాజిట్లను కొనసాగించాలి. ఆ తర్వాత మాత్రమే ముందుస్తు విత్‌డ్రాలకు అనుమతిస్తారు. మీరు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. మీ దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుని.. కావాల్సిన పత్రాలు సమర్పించి.. ఖాతా తెరవాల్సి ఉంటుంది.
SBI WeCare Vs SBI Amrit Kalash : ఎస్బీఐ వీకేర్ Vs అమృత్ కలశ్.. ఏది బెస్ట్ ఆప్షన్?