Onion Price Decrease : వచ్చే ఏడాది జనవరి నాటికి పెరిగిన ఉల్లి ధరలు మరింత దిగొస్తాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. జనవరిలో కిలో ఉల్లి ధర రూ.40 కంటే దిగువకు వస్తుందని ఆశిస్తున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం కిలో ఉల్లి సగటు ధర రూ.57.02గా ఉంది.
ఇటీవలి కాలంలో ఉల్లి ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులను వచ్చే ఏడాది మార్చి వరకు నిషేధించింది. ఈ క్రమంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.80 దాటింది. మండీల్లో రూ.60పైనే పలుకుతోంది. దీంతో కేంద్రం రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ధరలు ఎప్పుడు దిగొస్తాయని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రోహిత్ కుమార్ సింగ్ పై విధంగా బదులిచ్చారు.
'కొంతమంది కిలో ఉల్లి ధర రూ.100 దాటుతుందని అంటున్నారు. కానీ రూ.60 దాటదని మేం చెబుతూ వస్తున్నాం. సోమవారం ఉదయం (డిసెంబర్ 11) దేశవ్యాప్తంగా సగటు ధర రూ.57.02గా ఉంది. ఇది రూ.60 దాటదు. ఎగుమతులపై నిషేధం వల్ల రైతులపై ఎలాంటి ప్రభావం ఉండదు. కొంతమంది వ్యాపారులు బంగ్లాదేశ్, భారత్ మార్కెట్ల మధ్య ఉన్న ధరల వ్యత్యాసాన్ని సాకుగా చూపి రైతులను మభ్యపెడుతున్నారు. దీనివల్ల వ్యాపారులే నష్టపోతారు' అని రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు.
జులై నుంచి ఉల్లి ధరల పెరుగుదల రేటు రెండంకెల్లో నమోదవుతోంది. అక్టోబర్‌లో ఇది 42.1 శాతం దగ్గర నాలుగేళ్ల గరిష్ఠానికి చేరింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 4 మధ్య దేశం నుంచి 9.75 లక్షల టన్నుల ఉల్లి ఎగుమతి అయ్యింది. బంగ్లాదేశ్, మలేసియా, యూఏఈ మన ఉల్లిని అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గిందనే వార్తలు వెలువడినప్పటి నుంచి దేశంలో ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీన్ని కట్టడి చేయడం కోసమే కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది.