Nokia Layoffs 2023 : ప్రముఖ టెక్ దిగ్గజం నోకియా తమ ఉద్యోగులకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యయ నియంత్రణలో భాగంగా 14 వేల మంది సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు సిద్ధపడినట్లు గురువారం ప్రకటించింది. అయితే ఈ తొలగింపులు దశలవారీగా ఉంటాయని సంస్థ తెలిపింది. కాగా, తొలగించనున్న ఉద్యోగుల సంఖ్య కంపెనీలోని మొత్తం సిబ్బందిలో 16 శాతం.
ఇదే కారణమా?
నోకియా కంపెనీకి ఉత్తర అమెరికా మార్కెట్ అత్యంత కీలకం. ఇక్కడ ఈ సంస్థకు భారీ ఎత్తున వ్యాపారం జరుగుతుంటుంది. అయితే ఇటీవల ఈ కంపెనీకి చెందిన 5జీ పరికరాలకు ఇక్కడ డిమాండ్ భారీగా పడిపోయింది. దీంతో ఈ ఏడాది మూడో త్రైమాసికంలో సంస్థ విక్రయాలు 20 శాతం మేర తగ్గాయి. దీని ఫలితంగానే కంపెనీ తన ఖర్చుల్ని తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకుంది. 2026 నాటికి 800 మిలియన్ యూరోల నుంచి 1.2 బిలియన్ యూరోల మేరకు వ్యయాన్ని నియంత్రించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ తాజా నిర్ణయంతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 86 వేల నుంచి 72 వేలకు తగ్గనున్నట్లు పేర్కొంది.
"వచ్చే ఏడాదిలో 400 మిలియన్ల యూరోలు, 2025లో 300 మిలియన్ల యూరోల వరకు ఖర్చును తగ్గించుకోవాలని అనుకుంటున్నాం. మూడో త్రైమాసికంలో అమ్మకాలు తగ్గాయి. అయినా రానున్న త్రైమాసికంలో విక్రయాలు పెరగుతాయని భావిస్తున్నాం"
- పెక్కా లాండ్‌మార్క్, కంపెనీ సీఈఓ
2022-23 ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది మూడో త్రైమాసికంలో నోకియా విక్రయాలు 20% క్షీణించి 6.24 బిలియన్ యూరోల నుంచి 4.98 బిలియన్ యూరోలకు పడిపోయాయి. కంపెనీ నికర లాభం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 551 మిలియన్ల యూరోల నుంచి 299 మిలియన్ యూరోలకు క్షీణించింది. ప్రధానంగా ఉత్తర అమెరికా మార్కెట్‌లో బలహీనత కారణంగా కంపెనీ యూనిట్ నిర్వహణ లాభం 64% తగ్గింది.
ఈ మూడింటితో..
క్లౌడ్ కంప్యూటింగ్, AI సృష్టిస్తున్న విప్లవాలు మరింత కార్యరూపం దాల్చాలంటే విస్తృతంగా మెరుగైన సామర్థ్యాలను కలిగి ఉన్న నెట్‌వర్క్‌లలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని నోకియా సీఈఓ అన్నారు. 'మార్కెట్ ఎప్పుడు మెరుగుపడుతుందనేది స్పష్టంగా చెప్పలేము. ఈ పరిస్థితుల్లో నోకియా నిశ్చలంగా నిలబడలేదు. అయితే వ్యూహం, కార్యాచరణ, ఖర్చు అనే మూడు అంశాల ఆధారంగా తీసుకునే నిర్ణయాత్మక చర్యలతో కంపెనీ నిలదొక్కుకోగలదు. అలాగే ఈ చర్యలు కంపెనీ వాటాదారులకు గణనీయమైన విలువను అందించగలవు అని నేను నమ్ముతున్నాను' అని పెక్కా పేర్కొన్నారు.
TCS Dress Code : TCSలో ఇక స్ట్రిక్ట్‌గా డ్రెస్ కోడ్ అమలు.. కారణం ఇదేనంట!
How To Plan For Retirement : పదవీ విరమణ ప్రణాళిక.. ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎప్పుడు ప్రారంభించాలి?