New Electric Bike In India : విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'టోర్క్ మోటార్స్' (Tork Kratos R Urban Trim) భారత విపణిలో సరికొత్త ఈ-బైక్‌ను విడుదల చేసింది. 'క్రాటోస్-ఆర్ అర్బన్ ట్రిమ్' పేరుతో ఈ వేరియంట్‌ను ఇటీవలే లాంఛ్ చేశారు. రోజువారీ రైడ్‌లను ఆస్వాదించే సిటీ రైడర్ల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని దీనిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ మోడల్ పనితీరుకి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి లోపాలు తలెత్తకుండా ఉండేందుకు తయారీ విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదని చెప్పింది. కాగా, దీనికి సంబంధించిన విక్రయాలను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తామని సంస్థ సీఈఓ కపిల్ షెల్కే వెల్లడించారు.
"మేము కొత్తగా భారత మార్కెట్‌లోకి ప్రవేశించినప్పుడు.. మా వినియోగదారుల రైడింగ్ స్టైల్‌తో పాటు, బైక్ వినియోగ విధానంలోనూ గొప్ప వేరియేషన్లను మేము గమనించాము. ఇందుకు తగ్గట్లే మా సరికొత్త ఈ-బైక్‌ను తీర్చిదిద్దాము. ఈ అర్బన్ ట్రిమ్ మోడల్ తయారీలో మేము ఏ మాత్రం రాజీపడలేదు. అలాగే అందరికీ అందుబాటులో ఉండే ధరలోనే దీనిని అందిస్తున్నాము. డైలీ రైడ్‌ను ఆస్వాదించే రైడర్ అవసరాలను, అభిరుచులను నెరవేర్చే విధంగా దీనిని తయారు చేశాము."
- కపిల్ షెల్కే, టోర్క్ మోటార్స్ సీఈఓ
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Kratos-R తరువాతి వెర్షన్ Tork Kratos R Urban. అర్బన్ ట్రిమ్ రోజువారీ సిటీ ట్రావెల్‌ను ఆస్వాదించేందుకు అనువైన ఫీచర్లతో రూపొందించారు. ఈ వేరియంట్లో హోమ్ ఛార్జింగ్ సెటప్‌ను కూడా అమర్చారు. అయితే బైక్ లుక్, పవర్‌ట్రెయిన్ విషయాల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం.
ఫీచర్స్ ఇవే..
- ఈ బైక్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే గరిష్ఠంగా 100 కిలోమీటర్ల వరకు.. గంటకు 70 కి.మీల వేగంతో ప్రయాణించవచ్చు.
- మిడ్‌నైట్ బ్లాక్, స్ట్రీకీ రెడ్, ఓషనిక్ బ్లూ అనే మూడు కలర్స్ వేరియంట్స్‌తో ఈ బైక్‌ను తీసుకొచ్చారు.
- ఈ మోటార్‌సైకిల్‌లో 4.0 kWh Li-ion (IP 67 Rated) బ్యాటరీని వినియోగించారు.
- ఇటీవలే పేటెంట్ హక్కులు దక్కించుకున్న 'యాక్సియల్ ఫక్స్ మోటార్'ను ఇందులో వాడారు. ఈ మోటార్ 96 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
New Electric Scooter 2023 : ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ (Tork Motors New Bike)లో మల్టీ-రైడ్ మోడ్‌లు (ఎకో, సిటీ, స్పోర్ట్స్), రివర్స్ మోడ్, ఫాస్ట్ ఛార్జింగ్, ఇన్-యాప్ నావిగేషన్, బ్లూటూత్ ద్వారా లైవ్ డాష్, ట్రాక్ మోడ్ అనలిటిక్స్, స్మార్ట్ అనలిటిక్స్, గైడ్ మీ హోమ్ లైట్లు లాంటి సూపర్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్‌లను మొదటి 30 రోజులపాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. అయితే తరువాత కూడా ఈ ఫీచర్లను ఉపయోగించుకోవాలంటే.. వినియోగదారులు బైక్ కొనుగోలు చేసిన ఆరు నెలలలోపు రూ.20,000 మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
స్వాతంత్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి Tork Kratos R Urban Trimను విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు కంపెనీ తెలిపింది. అలాగే ఈ కొత్త Kratos-R అర్బన్ ట్రిమ్ వేరియంట్ ధరను రూ.1.67 లక్షలు (New EV Bike Price)గా నిర్ణయించింది. దీనికి సంబంధించిన బుకింగ్‌లను ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. తమ వెబ్సైట్లో కేవలం రూ.999లు చెల్లించి ఈ-బైక్‌ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. అలాగే అదే రోజు దేశంలోని అన్ని టార్క్ షోరూంల్లో కూడా ఈ బైక్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.