Narayana Murthy Clarity On Extra Working Hours : ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారతీయ యువత వారానికి 70 గంటలు పనిచేయాలని చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు ప్రముఖ వ్యాపారవేత్త, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి. ఈ సూత్రాన్ని తాను కూడా ఆచరించినందుకే నేటి భారత యువతరానికి ఆ మేరకు సందేశమిచ్చినట్లు పేర్కొన్నారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చేసిన ఈ ప్రకటనను మరోసారి సమర్థించుకున్నారు ఈ వ్యాపార దిగ్గజం.
'వ్యతిరేకత ఉన్నా'
'దేశంలో రైతులు, ఫ్యాక్టరీ కార్మికులు చాలా కష్టపడి పనిచేస్తారు. ఇది భారతదేశంలో చాలా సాధారణం. అయితే దేశంలోని విద్యావంతులు, ఎవరికైతే అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందిందో వారిలో కొందరికి మాత్రమే అత్యంత ఎక్కువగా కష్టపడి పని చేసే అదృష్టం వరిస్తుంది. చైనా లాంటి ప్రపంచ ఆర్థిక శక్తులతో పోటీ పడాలంటే భారత్‌కు ఇలాంటి అంకితభావం అవసరం' అని నారాయణ మూర్తి అన్నారు. తాను చేసిన ఈ అదనపు పని గంటల ప్రతిపాదనకు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ చాలామంది తన విదేశీ స్నేహితులు, ఎన్ఆర్ఐలు తాను చేసిన విజ్ఞప్తి పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
'ఆయన వారానికి 90 గంటలు చేసేవారు'
ఇక ఇదే అంశంపై నారాయణ మూర్తి భార్య సుధామూర్తి మాట్లాడారు. తమ కుటుంబం వారానికి 70 గంటలు పనిచేస్తుందని, ఇది సర్వసాధారణమైన అంశమని పేర్కొన్నారు. నారాయణ మూర్తి వారానికి 90 గంటలు పనిచేసేవారని గుర్తుచేశారు. మరోవైపు, ఇన్ఫోసిస్‌లో తాను ఉదయం 6 గంటలకు పనిని ప్రారంభించి రాత్రి 9 గంటలకు ముగించేవాడినని చెబుతూ, ముందు తాను పాటించకుండా ఇతరులకు ఎప్పుడూ ఈ విధంగా సలహాలివ్వలేదని స్పష్టం చేశారు టెక్ దిగ్గజం నారాయణ మూర్తి. ఈ సందర్భంగా తన భార్య సుధామూర్తిని ఇన్ఫోసిస్ కంపెనీకి దూరంగా ఉంచి పొరపాటు చేశానని నారాయణ మూర్తి అన్నారు. ఆ రోజుల్లో తాను తప్పుగా ఆలోచించానని తెలిపారు.
Narayana Murthy 70 Hours Issue : కాగా, ఈ అదనపు గంటలు పని చేయడాన్ని ఓ ప్రతిజ్ఞగా పూనుకోవాలని గతేడాది అక్టోబరులో అన్నారు 77 ఏళ్ల ఇన్ఫీ ఫౌండర్. 3వన్4 క్యాపిటల్ తొలి పాడ్‌కాస్ట్ 'ది రికార్డ్' అనే ఎపిసోడ్‌లో ఆయన ఈ మేరకు మాట్లాడారు. అప్పుడే అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ నిలవలగలదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి ఇన్ఫోసిస్ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్ పాయ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణం, టెక్నాలజీ, ఇన్ఫోసిస్ సహా పలు కీలక అంశాల గురించి కూడా ప్రస్తావించారు నారాయణ మూర్తి.
"ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత శక్తి చాలా తక్కువ. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలి. మన దేశంలో ఉత్పాదకత పెరగకుండా, ప్రభుత్వంలో ఒక స్థాయిలో వేళ్లూనుకున్న అవినీతిని తగ్గించకుండా, అధికార నిర్ణయాల్లో జాప్యం తొలగకుండా, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడడం అసాధ్యం. అందుకని 'యువత ఇదీ నా దేశం. నా దేశం కోసం నేను వారానికి 70 గంటలు పనిచేస్తాను' అనే ప్రతిజ్ఞ తీసుకోవాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్, చైనా వంటి దేశాలు ఇదే విధంగా కష్టపడ్డాయి. వీటితో పోటీపడాలంటే మనదేశ యువతరం కూడా అదే తరహాలో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ప్రతి జర్మన్ పౌరుడు అదనపు గంటలు పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు కొన్నేళ్ల పాటు పనిచేసి సత్ఫలితాలు సాధించారు."
- నారాయణ మూర్తి, ఇన్ఫోసిస్ ఫౌండర్
'రిషిని చూసి గర్విస్తున్నా'.. అల్లుడిని పొగడ్తలతో ముంచెత్తిన నారాయణమూర్తి!