రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దేశంలోనే కాదు, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. ఆయన ఆస్తి సుమారు రూ.7 లక్షల కోట్లపైనే ఉంటుంది. వ్యాపార విజయాలతో పాటు వ్యక్తిగత జీవితం విషయంలోనూ ఆయన నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవలే ముకేశ్ అంబానీ నివాసం ఉండే యాంటిలియాలో పనిచేసే కార్మికులకు నెలకు లక్షల రూపాయల వేతనం ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. రిలయన్స్ ఉద్యోగులకు కూడా ఆయన మంచి సౌకర్యాలు కల్పిస్తారనే పేరుంది. తాజాగా ఆయన మనోజ్ మోదీ అనే ఉన్నత ఉద్యోగికి ముంబయిలో ఉన్న రూ.1500 కోట్ల విలువైన ఇంటిని కానుకగా ఇచ్చారు.
మనోజ్ మోదీకి ముకేశ్ అంబానీ కానుకగా ఇచ్చిన ఇల్లు.. ముంబయిలోని నేపియన్ సీ రోడ్‌లో ఉంది. మొత్తం 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆ ఇల్లు ఉందని సమాచారం. ఆ ఇంట్లోని ఫర్నీచర్ ఇటలీ నుంచి దిగుమతి చేశారట. 22 అంతస్తుల ఇంట్లో 19, 20, 21 అంతస్తుల్లో మనోజ్ మోదీ కుటుంబసభ్యులు నివసించనున్నారు. 16, 17, 18వ అంతస్తులు మోదీ పెద్ద కుమార్తె ఖుష్బూ పొద్దార్, ఆమె కుటుంబసభ్యుల కోసం రిజర్వ్ చేశారట. ఈ ఇంట్లో ఖుష్బూతో పాటు ఆమె భర్త, అత్త, మరిది ఉంటున్నారట. 11, 12, 13 అంతస్తులు రెండవ కుమార్తె భక్తి మోదీకి కేటాయించారు.
మనోజ్ మోదీ ఏదో సాదాసీదా ఉద్యోగి కాదు. ప్రస్తుతం ఆయన.. రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా.. ముకేశ్ అంబానీ కుటుంబానికి అత్యంత సన్నిహితులు. అంబానీకి రైట్ హ్యాండ్‌గా పేరు తెచ్చుకున్న మనోజ్ మోదీ.. రిలయన్స్‌లో దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. ధీరూభాయ్ అంబానీ కాలంలోనే ఆయన రిలయన్స్‌లో ఉద్యోగిగా చేరారు. రిలయన్స్ సామ్రాజ్య విస్తరణలో మనోజ్ మోదీ కీలక పాత్ర పోషించారు. ఆయనది మృదువైన వ్యక్తిత్వమని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. రిలయన్స్ సంస్థ.. ఒక్క రూపాయి కూడా నష్టపోని విధంగా ఆయన ఎన్నో కాంట్రాక్టులను సీల్ చేశారని సమాచారం. 2020లో ఫేస్‌బుక్‌తో కుదిరిన రూ.43వేల కోట్ల డీల్ సహా.. అనేక భారీ ఒప్పందాలు ఈయనే ఖరారు చేశారట.
ముకేశ్ అంబానీ, మనోజ్ మోదీ ఇద్దరూ స్నేహితులు కూడా. వీరిద్దరూ ఒకే పాఠశాలలో ఒకే తరగతిలో చదువుకున్నారు. ఇద్దరూ ముంబయిలో హిల్ గ్రాంజ్ స్కూల్‌లో క్లాస్‌మేట్స్. మనోజ్ మోదీ.. ముంబయి యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్ కూడా పూర్తి చేశారు. 1980లో మనోజ్ మోదీ రిలయన్స్‌లో చేరారు. ఆ సమయంలో ధీరూభాయ్ అంబానీ రిలయన్స్‌కు నేతృత్వం వహిస్తున్నారు. మనోజ్ మోదీ తండ్రి హరిజీవందాస్ కూడా ముకేశ్ తండ్రి ధీరూభాయ్‌తో కలిసి పనిచేశారు.
ఇవీ చదవండి: