MMSC Vs SSY : కేంద్ర ప్రభుత్వం మగువల కోసం ప్రత్యేకంగా 'మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ (MSSC)' పేరుతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలనే లక్ష్యంతో ఈ చిన్న పొదుపు పథకాన్ని రూపొందించడం జరిగింది. అదే విధంగా ఆడ బిడ్డల భవిష్యత్ కోసం, వారి స్వావలంబన కోసం సుకన్య సమృద్ధి యోజన (SSY) స్కీమ్‌ను కూడా కేంద్రం ప్రవేశపెట్టింది. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్
Mahila Samman Saving Certificate Details :
- పెట్టుబడి వ్యవధి : 2 సంవత్సరాలు
- పెట్టుబడి పరిధి : కనిష్ఠంగా రూ.1000 నుంచి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.
- వడ్డీ రేటు : కేంద్ర ప్రభుత్వం 7.5 శాతం వడ్డీని అందిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీ జమ అవుతుంది.
- ఉపసంహరణ (విత్డ్రావెల్) : స్కీమ్‌లో చేరిన ఒక సంవత్సరం తరువాత, ఖాతాదారుడు తను ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
- మెచ్యూరటీ : ఉదాహరణకు 2023 అక్టోబర్‌లో ఖాతా తెరిస్తే, 2025 అక్టోబర్‌లో మెచ్యూర్ అవుతుంది.
- అర్హతలు : వయస్సుతో సంబంధం లేకుండా.. మహిళలు అందరూ ఈ పొదుపు పథకంలో చేరవచ్చు.
అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా?
మహిళలు సమీపంలోని బ్యాంక్ లేదా పోస్టు ఆఫీస్‌కు వెళ్లి, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ కోసం దరఖాస్తును సమర్పించాలి. అలాగే ఆధార్, పాన్ లాంటి కేవైసీ పత్రాలను సబ్మిట్ చేయాలి. తరువాత మీకు వీలైనంత మొత్తాన్ని నగదు లేదా చెక్కు రూపంలో డిపాజిట్ చేయాలి.
సుకన్య సమృద్ధి యోజన
Sukanya Samriddhi Yojana Scheme Details :
- అర్హతలు : 10 సంవత్సరాలలోపు ఆడపిల్లల పేరు మీద ఖాతా తెరవవచ్చు.
- వడ్డీ రేటు : డిపాజిట్ చేసిన మొత్తంపై 8% వడ్డీ ఇస్తారు.
- పెట్టుబడి పరిధి : సంవత్సరానికి కనిష్ఠంగా రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.
- పెట్టుబడి కాలం : ఆడపిల్లకు 15 ఏళ్లు వచ్చే వరకు మదుపు చేయవచ్చు.
- ఉపసంహరణ : అమ్మాయి వయస్సు 18 సంవత్సరాలు దాటిన తరువాత ఉన్నత చదువుల కోసం 50 శాతం వరకు అమౌంట్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. అమ్మాయి వయస్సు 21 ఏళ్లు దాటిన తరువాత స్కీమ్‌లోని అమౌంట్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
- పన్ను ప్రయోజనాలు : ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
ఖాతా తెరవడం ఎలా?
ఏదైనా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్‌లో 10 సంవత్సరాలలోపు వయస్సున్న బాలిక పేరు మీదుగా తల్లిదండ్రులు 'సుకన్య సమృద్ధి యోజన' ఖాతాను తెరవచ్చు.
ముఖ్యమైన బేధాలు!
Mahila Samman Saving Certificate Vs Sukanya Samriddhi Yojana :
1. పాలసీ వ్యవధి :
- మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ (MMSC) స్కీమ్ అనేది ఒక షార్ట్ టెర్మ్ స్కీమ్.
- సుకన్య సమృద్ధి యోజన (SSY) అనేది ఒక లాంగ్ టెర్మ్ స్కీమ్.
2. అర్హతలు :
- MSSC స్కీమ్ ప్రధానంగా వయోజనులైన మహిళ కోసం ఉద్దేశించినది.
- SSY స్కీమ్ అనేది ప్రత్యేకంగా 10 ఏళ్లలోపు బాలికల కోసం రూపొందించిన పథకం.
3. పెట్టుబడి లక్ష్యం :
- మహిళల స్వావలంబన, ఆర్థిక సాధికారత కోసం MSSC స్కీమ్ ఉపయోగపడుతుంది.
- బాలికల విద్య, వివాహం మొదలైన అవసరాల కోసం SSY పథకం అక్కరకు వస్తుంది.
మీకు గనుక అవకాశం ఉంటే.. ఈ రెండు ప్రభుత్వ పథకాలను కచ్చితంగా ఉపయోగించుకోవడం మంచిది.
Things To Check Before Buying Land : భూమి కొంటున్నారా?.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!